మధ్యప్రదేశ్ పెట్రోలియం శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్వాలియర్‌లోని హజీరా పాఠశాలను శనివారం నాడు మంత్రి ప్రద్యుమ్న సింగ్ సందర్శించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై ఆయన వివరించారు. అయితే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో వినియోగించుకోలేకపోతున్నామని.. దుర్గంధంతో అటువైపు వెళ్లలేకపోతున్నామని ఓ విద్యార్థిని మంత్రి దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: మా పథకం వల్లే దేశంలో మహిళల సంఖ్య పెరిగింది: కేంద్రమంత్రి
దీంతో ప్రద్యుమ్న స్వయంగా రంగంలోకి దిగి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అత్యంత అశుభ్రంగా ఉన్న ఆ పాఠశాల టాయిలెట్లను మంత్రి తోమర్ స్వయంగా పైపుతో నీళ్లు పోస్తూ, చీపురుతో రుద్ది మరీ కడిగారు. అధికారులతో పని చేయించడంతో పాటు పని చేసే బాధ్యత ప్రజాప్రతినిధులపై కూడా ఉంటుందని మంత్రి ప్రద్యుమ్న అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులకు తమ బాధ్యతలు తెలియజేసేందుకు తాను ఇలా చేశానని వివరణ ఇచ్చారు. కాగా పాఠశాలల్లోని టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు.