తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఈ రోజు లాటరీ నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు కొత్త మద్యం దుకాణాలకు రూ.2లక్షలతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాటరీ ద్వారా కొత్త దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో మద్యం దుకాణాల లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393, ఓపెన్ క్యాటగిరిలో 1,834 మద్యం దుకాణాలను కేటాయించారు.
అయితే మొదటిసారి రిజర్వేషన్ విధానంలో మద్యం దుకాణాలు ఎంపిక నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా 67,849 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,356.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత 2019లో నిర్వహించిన మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ.975.68 కోట్లు వచ్చింది.