తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో పాటు ధాన్యం కొనుగోలు ఇతరత్ర అంశాలపై 17, 18 తేదీల్లో సమావేశం నిర్వహించారు. 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది. మరుసటి రోజు 18వ తేదీన జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో దళిత బంధు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. కేసీఆర్ దళితబంధు అమలు పై సమీక్షించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాలో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చి లోపు అమలు చేసే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు శిక్షణాకార్యక్రమాల నిర్వహణ పై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.