NTV Telugu Site icon

కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నారా..?

cm kcr

తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్‌ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు మాటలు నమ్మాలో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల వ్యాఖ్యలు నమ్మాలో రైతులు పాలుపోవడం లేదు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేతలేమో టీఆర్‌ఎస్‌, బీజేపీలు కావాలనే రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మొన్నామధ్య జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఇటీవల జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపుతో తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఖాయం అన్నట్లు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే ఇలాగే కొనసాగితే.. బీజేపీ తెలంగాణలో పుంజుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా.. అని ఆలోచన కేసీఆర్‌ మదిలో మెదిలిందా..? అందుకే బీజేపీ ని టార్గెట్‌ చేశారా..? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది… కేసీఆర్‌తో పాటు యావత్తు టీఆర్‌ఎస్‌ నాయకులపైన కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్‌ ఆ వంక కన్నెత్తి చూడడం లేదు.ఎందుకంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం డిపాజిట్‌ కూడా రాకపోవడం. దీంతో కాంగ్రెస్‌ ఈ మధ్యకాలంలో తెలంగాణలో బలపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయనే భావనేనని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఏం మాట్లాడినా.. అందులో ఒక అవకాశం దొరికితే దాన్ని ఆయుధంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ అధినేతతో సహా టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు.

వీలైనంత వరకు బీజేపీపై ప్రజల్లో ఓ విముఖత తీసుకురావాలనే భావన ఖచ్చితంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రైతన్నలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలు చేపట్టేందుకు నడుం బిగించింది. ధాన్యం కొనుగోలును ఆసరాగా చేసుకొని మరోసారి ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై నెలకొన్న విముఖతను తరిమికొట్టేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది ప్రతిపక్షాల వాదన. అందుకే కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసి… ఈ విధంగా టీఆర్‌ఎస్‌ నేతలను రంగంలోకి దింపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీపై పోరాటానికి ధాన్యం కొనుగోలుకి మించిన ఆయుధం లేదని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.