ఆఫ్ఘన్‌నిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన అమెరికా.. ప్రతీకార దాడులు తప్పవని.. వారిని వెంటాడి వేటాడి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది… ముందు ఉగ్రవాదుల బాంబుల మోత, వెనక తాలిబన్ల హెచ్చరిక. ఆఫ్ఘన్ దాటాలి అనుకునే వారికి ఆగస్టు 31 ఆఖరు తేది. ఇది వారి ప్రాణాలకు చివరితేదీగా మారింది. ఈ ఐదు రోజుల్లో దేశం దాటిన వాళ్లు ప్రాణాలతో ఉన్నట్టు. మిగిలి పోయిన వాళ్లు తాలిబన్ల చేతుల్లో చచ్చినట్టే. అప్ఘానిస్తాన్‌లో ఉన్నవారిలో ఇప్పుడు కనిపిస్తున్న భయం ఇదే. మిగిలిన ఐదు రోజుల్లో దేశం దాటి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఇక, కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి తమ పనే అని ఆఫ్ఘన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐసిస్-ఖోరసాన్(ఐఎస్-కే) ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి ఫొటోతో కూడిన ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. గురువారం రాత్రి కాబూల్ ఎయిర్‌పోర్టులో జరిగిన అత్మాహుతి, బాంబు దాడుల్లో దాదాపు 180 మంది చనిపోయారు. అందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. దీంతో.. కాబూల్‌లో పేలుళ్లకు బాధ్యులైనవారు తప్పక మూల్యం చెల్లించుకొంటారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
కాబూల్ పేలుళ్ల అనంతరం గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జో బై బైడెన్.. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారు హీరోలు అని అభివర్ణించారు. ఆఫ్ఘన్‌లోని ఐసిస్-కే స్థావరాలపై దాడికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కాబూల్‌లో పేలుళ్లకు బాధ్యులైన వారిని, అమెరికాకు హాని తలపెట్టాలని చూసినవారిని మేం ఎప్పటికీ మర్చిపోం.. క్షమించం.. వదిలిపెట్టం.. వెంటాడి వేటాడుతాం.. వాళ్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.. ఇక, ఆఫ్ఘన్ నుంచి పౌరులను తరలించడాన్ని ఉగ్రదాడులు అడ్డుకోలేవన్న ఆయన.. ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా అమెరికా పౌరులందరినీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ దేశం నుంచి తరలిస్తామని స్పష్టం చేశారు.. కాగా, ఆగస్టు 31 దాటితే అంతే, ఆ తర్వాత దేశం దాటే ఛాన్సే లేదని చెబుతున్నారు తాలిబన్లు. ఆ తర్వాత దేశం దాటాలంటే తగిన డాక్యుమెంట్లు, అనుమతులు కావాలని క్లియర్ కట్ గా చెప్పేశారు. అమెరికా సహా నాటో కూటమిలోని దేశాలు కూడా ఆగస్టు 31లోపు తమ మనుషుల్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. బాంబు పేలుళ్ల తర్వాత తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. ఇంతకు ముందుతో పోలిస్తే తరలింపు ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది.