ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య తాజా చిత్రం ‘జై భీమ్’ గురించి జనం భలేగా ముచ్చటించుకుంటున్నారు. అందులో అమాయకులైన గిరిజనులను చేయని నేరాలు అంగీకరించమని పోలీసులు వేధించడం చూశాం. ఇలాంటి కథలు తెలుగు స్టార్ హీరోస్ ఎవరూ చేయడం లేదనీ కొందరు వాపోవడమూ జరిగింది. అయితే 30 ఏళ్ళ క్రితం ఈ తరహా కథల్లో మన స్టార్ హీరోస్ కూడా నటించారు. చిరంజీవి నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’, నాగార్జున నటించిన ‘జైత్రయాత్ర’ ఆ కోవకు చెందినవే. ఎక్కడో మారుమూల ఉన్న గిరిజన తండాల్లోనే కాదు, మరికొన్ని ప్రాంతాల్లోనూ కొందరు పేదవారిని, అమాయకులను బలవంతంగా పోలీసులు దొంగలుగా మార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ కథతో రూపొందిన చిత్రమే ‘జైత్రయాత్ర’. ఈ సినిమాతో ఉప్పలపాటి నారాయణరావు దర్శకునిగా పరిచయం అయ్యారు. 1991 నవంబర్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించారు.
‘జైత్రయాత్ర’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుని పేరు తేజ. అనాథాశ్రమంలో పెరిగి, లా చదువుతాడు. అతని సహ విద్యార్థిని శాంతి. వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఓ రోజు తనను పెంచి పెద్ద చేసిన ఫాదర్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి, తన ఫోటో తీసుకుని పోవడం చూస్తాడు తేజ. అతణ్ణి అనుసరిస్తాడు తేజ. అతడే తన అసలు తండ్రి అని తెలుస్తుంది. పోలీసుల కారణంగా తన తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకుంటాడు. ఊరిలో ఎంతోమంది అమాయకులు పోలీసుల బలవంతం మీద చేయని నేరాలను కూడా అంగీకరించడం చూస్తాడు. ఆ పరిస్థితిని ఎదిరిస్తాడు. తేజను కూడా పోలీసులు పట్టుకుపోయి, ఫోటో తీస్తారు. దాంతో తండ్రి బాధపడతాడు. తన కొడుకు దొంగ అనే ముద్ర వేసుకోరాదనే చిన్నప్పుడే పట్నంలో వదలివేసి వచ్చినట్టు చెబుతాడు తండ్రి. తేజ తండ్రి మాట విని నగరం చేరుకుంటాడు. అయినా, తేజ మనసు తన ఊరిచుట్టూ తిరుగుతుంది. చివరకు తన ప్రియురాలికి ఈ విషయం చెబుతాడు. వారిద్దరూ ఆ ఊరు చేరుకొని, అమాయకులలో చైతన్యం తీసుకువస్తారు. ఆ ఊరిలో తమ మనిషిగానే ఉంటూ ఓ వ్యక్తి అమాయకులను దొంగలుగా మారుస్తూ ఉంటాడు. అతని రంగు బయట పెడతాడు తేజ. అతణ్ణి చితక బాదుతాడు అతణ్ణి చంపేయకుండా ఊరి జనానికే వదిలేస్తాడు. జనం అతడి ప్రాణం తీస్తారు. చివరకు తేజను పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో కథ ముగుస్తుంది.
నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో విజయ్ చందర్, ఢిల్లీ గణేశ్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, నిళగల్ రవి, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ, బెనర్జీ, సత్య ప్రకాశ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చడం విశేషం. ఇందులోని పాటలను సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, అదృష్టదీపక్ రాశారు. అదృష్టదీపక్ రాసిన “ఎన్నాళ్ళమ్మా… ఎన్నేళ్ళమ్మా… లోకాన ఈ చీకటి… ” సాంగ్ అన్నిటినీ మించి ఆకట్టుకుంది. మిగిలిన పాటల్లో “ఒక్కటై వచ్చాయి…”, “నీడల్లే ఉన్నా…”, “పరుగు తీయనీ…” అలరించాయి.
అప్పట్లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా సాగిపోతున్నారు. ఆ సమయంలో నాగార్జున, విజయశాంతి జంట అనగానే అభిమానులు ఈ సినిమాపై భలే అంచనాలు పెట్టుకున్నారు. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రూపొందిన ‘జైత్రయాత్ర’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకునిగా ఉప్పలపాటి నారాయణరావుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం తమిళంలో ‘పొంగడ నీగలుమ్ ఉంగా అరసియలుమ్’ పేరుతో అనువాదమయింది.