పేదవాడైనా.. ధనవంతుడైనా తనకు న్యాయం కోసం కోర్టుల వైపే చూస్తారు. అందరికీ న్యాయం దక్కాలనేదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా జై భీమ్… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మార్మోగిపోతోంది. అందులో అన్యాయంగా అమాయకుడిపై కేసులు మోపి.. జైల్లో చిత్ర హింసలు ఎలా పెడతారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా రామోజీ తండాలో జరిగిన ఘటన జైభీమ్ చిత్రాన్ని తలపించింది. అన్యంపుణ్యం ఎరుగని గిరజనుడిపై అన్యాయంగా దొంగతనం నేరం మోపుతారు. పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. అలాంటి దుర్మార్గపు పోలీసులను ఓ లాయర్ న్యాయస్థానం ద్వారా ఎలా శిక్షించగలిగాడన్న కథాంశంపై తెరకెక్కిన సినిమా జైభీమ్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. నిజజీవిత కథతో తీసిన ఈ చిత్రంలో వెనకబడిన తరగతులపై పోలీసులు ఎలాంటి దాష్టీకాలకు పాల్పడతారనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి దురాగతాలు నిజజీవితంలోనూ కళ్లకు కడుతున్నాయి.
Read Also: తమిళనాడులో భారీ వర్షాలు.. 14 మంది దుర్మరణం
తెలంగాణలోనూ జైభీమ్ తరహా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరులో ఐదు రోజుల క్రితం ఓ దొంగతనం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే.. నవీన్ అనే వ్యక్తి కనిపించాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్ లో విచారించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా తనతో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు చోరీలో పాల్గొన్నట్లు నవీన్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే వారిలో ఓ రైతు ఉన్నాడు. అతడే ధరావత్ వీరశేఖర్. తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించారు. పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయాడు. తాను ఏ తప్పు చేశానో చెప్పకుండా తీసుకెళ్లారని.. బాగా కొట్టారని.. ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పలేదని వాపోయాడు వీరశేఖర్.
విచారణ తర్వాత ఇంటికి వెళ్లిన వీరశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాళ్లు ఉబ్బిపోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి తర్వాత పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. వీరశేఖర్‌ను హింసించిన ఎస్ఐపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి ఈ విషయం బయటికి పొక్కకుండా ఎస్ఐ కాళ్లబేరానికి వచ్చాడు. పెద్ద మనుషుల ద్వారా ఈ వ్యవహారాన్ని రాజీ చేసినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీరశేఖర్ లాంటి ఎందరో అమాయకులు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న సందర్భాలు తరుచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.