చైనాలోని వ్యూహాన్ నగరంలో కరోనా మహమ్మరి తొలిసారి వెలుగుచూసింది. గడిచిన ఏడాదిన్నరగా ఈ మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా ధాటికి లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోట్లాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. కరోనా మొదటి దశలో అగ్రదేశాలైన అమెరికా, చైనా, బిట్రన్, ఇటలీ, ఫ్రాన్స్ ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. కరోనా తొలి వేవ్ ను సమర్ధవంతంగా భారత్ సెకండ్ వేవ్ లో మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సైంటిస్టుల కృషి ఫలితంగా కోవిడ్ మహమ్మరికి వ్యాక్సిన్ రావడంతో ప్రపంచం ఈ భయానక పరిస్థితుల నుంచి బయటపడుతోంది.
కరోనా నివారణకు మనముందు ఏకైక లక్ష్యం వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రక్కసిపై పోరాడుతున్నారు. ఈ పోరులో ఎంతోమంది కోవిడ్ వారియర్లు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. వైద్య సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా కరోనాపై ప్రజలకు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారు.
భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఉచితంగా చేస్తున్నారు. 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభించారు. తొలినాళ్లలో వ్యాక్సిన్ కొరత కారణంగా తెలంగాణకు కొంతమందికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి పెరగడంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గత పదినెలలుగా తెలంగాణ కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు పోటీపడుతుండగా మరికొన్ని జిల్లాలో చాలా నెమ్మదిగా జరుగుతోంది.
కరోనా రెండు డోసులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 27లక్షల 75వేల 505మంది టీకాకు అర్హులుండగా తొలి డోస్ వంద శాతం పూర్తికగా సెకండ్ డోస్ 50శాతం పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, మొబైల్ కేంద్రాల్లో కరోనా పంపిణీ స్పీడుగా జరుగుతోంది. అయితే కొంతమందిలో కరోనా టీకా వేసుకున్న తర్వాత స్వల్ప రియక్షన్స్ వస్తున్నాయి. దీంతో పలువురు టీకా వేసుకునేందుకు జంకుతున్నారు. ప్రతీఒక్కరూ కరోనా భయం వీడితే ఈ మహమ్మరిని మనమధ్య నుంచి తరిమివేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.