తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. వస్తే గిస్తే మళ్లీ సార్వత్రిక ఎన్నికలే. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాటి నుంచి అక్కడ ఎన్నికల హీట్ మొదలైంది. ఈ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్యంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా మారిపోయింది. ఈ ఎన్నిక తెలంగాణలోనే అత్యంత కాస్లీ ఎన్నికగా రికార్డుకెక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ తరుఫున వరుసగా గెలిచిన ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలుస్తున్నాడు. ప్రధానంగా పోటీ వీరిద్దరి మధ్య ఉండనుంది. కాంగ్రెస్ బరిలో ఉన్న అది సెకండ్ లేదంటే థర్డ్ ప్లేస్ కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆపార్టీకి సరైన అభ్యర్థి దొరకలేదా? అంటే అదేమీ కాదనే సమాధానమే విన్పిస్తుంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కొండా సురేఖ పేర్లు తెరపైకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ఖాయం చేయడం లేదు. కాంగ్రెస్ తాత్సారం చేయడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు సైతం తమను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా జాప్యం చేస్తోందని.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక దళిత, గిరిజన దండోరా పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే హుజురాబాద్ వైపు మాత్రం ఆయన కన్నెత్తి చూడటం లేదు. దీంతో రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈటల రాజేందర్ కు సహకరిస్తున్నారనే వాదనను టీఆర్ఎస్ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ తాత్కాలికంగా నష్టపోయినా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం కలుగుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఒకవేళ హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమి ఉండదు. అదే కాంగ్రెస్ వల్ల బీజేపీ అభ్యర్థి గెలిస్తే మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయం అని ఆపార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలనే వ్యూహంలో భాగంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తే ఆపార్టీకి తీరని నష్టం చేకూరడం ఖాయంగా కన్పిస్తుంది. హుజురాబాద్లో బీజేపీ గెలిస్తే ఆ ప్రభావం రాబోయే ఎన్నికలపై ఉంటుంది. ఇప్పటికే ఆపార్టీ తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే అధికారాన్ని ఉపయోగించుకొని ఆపార్టీ గెలిచిందని కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ గెలిస్తే మాత్రం అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్సే అవుతుంది. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.