NTV Telugu Site icon

బీసీసీఐ కెప్టెన్‌, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందా…?

బీసీసీఐ ప్రెసిడెంట్‌ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్‌ ఫెయిల్యూర్‌ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్‌ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్‌ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్‌, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్‌ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది. అయినా తప్పించకుండా ఈ డ్రామా ఆడినట్టు కూడా సమాచారం.

కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు… అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్‌ నడిచింది. కొహ్లితో కలిసి పనిచేయడం తన వల్ల కాదని.. కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు లెజెండ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే. టీం ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ ఉంటే… కోచ్‌గా చేయడానికి సీనియర్లు ఎవరూ ముందుకు రారని… బీసీసీఐ కి ఇచ్చిన నివేదికలో అనిల్‌ కుంబ్లే.. కోహ్లీ తీరును ఎండగట్టాడు. దీంతో… కోచ్‌ సెలక్షన్‌ కమిటీహెడ్‌గా గంగూలికి నచ్చకపోయినా… రవిశాస్త్రిని టీం ఇండియాగా కోచ్‌గా నియమించారు. 2021 టీ20వరల్డ్‌ కప్‌ ముగిసే సమయానికి కోచ్‌గా రవిశాస్త్రి గడువు ముగియడంతో… కోచ్‌తోపాటు … కెప్టెన్లను కూడా మారుస్తామని సంకేతాలు ఇచ్చాడు గంగూలి. అందుకు తగ్గట్టుగానే… టీ20 వరల్డ్‌ కప్‌ ముందే… 20-20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌ బై చెప్తానని ప్రకటించడం కోహ్లీ పాలిట శాపమైంది.

తర్వాత… కోచ్‌గా మిస్టర్‌ కూల్‌ ద్రవిడ్‌ ను నియమించడం కూడా కోహ్లీకి ఇబ్బందిగా మారింది. ద్రవిడే కోచ్‌గా ఉండాలని గంగూలి పట్టుబట్టడంతో… అనిల్‌ కుంబ్లే అనుభవంతో… ద్రవిడ్‌ ఎక్కడా ఇబ్బంది పడకుండా… గంగూలి కోహ్లీని సైడ్‌ కార్నర్‌ చేయడానికి అన్ని ఎత్తులు వేశాడు. తనంతట తానే కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకునేలా రూట్‌ క్లియరయ్యింది. కెప్టెన్‌గా… ఆటగాడిగా ఎప్పుడు కూల్‌గా ఉండే రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ లో మిస్టర్‌ వాల్‌గా ఉండి కోచ్‌ అయిన ద్రవిడ్‌ కోచింగ్‌లో టీం ఇండియా ఫ్యూచర్‌ బాగుంటుందని.. బీసీసీఐ భావించినట్టుంది. కోహ్లీని ఓ మంచి బ్యాట్స్‌మన్‌గా మాత్రమే పరిగణించాలని… కెప్టెన్సీ కి దూరమయ్యేలా స్కెచ్‌లు వేసి… పక్కనపెట్టేసింది.

ఈ పరిణామాల మధ్య బీసీసీఐ తీరుని టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. చెత్త రాజకీయాలు మానుకొని జట్టును ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు సమస్య విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ మధ్య కాదని.. బీసీసీఐ పెద్దల స్వార్ధం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షాలను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం పట్టించకండని ట్వీట్‌ చేస్తున్నారు. గంగూలీ, జై షా ఎవరి వైపున ఉన్నా, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోహ్లి ఫ్యాన్స్‌ మాత్రం… కోహ్లి, రోహిత్‌ మంచోళ్లే.. బీసీసీఐ పెద్దలే అన్నింటికి మూల కారణం అని చెప్పుకుంటున్నారు. ఇటు దాదా అభిమానులు సైతం అదే స్థాయిలో బదులిస్తున్నారు. గంగూలీ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తారని కామెంట్లు చేస్తున్నారు.