NTV Telugu Site icon

హుజురాబాద్‌ మహిళలు మెచ్చే నాయకుడెవరో..?

అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది. బీజేపీలో చేరిననాటి నుంచి హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల పర్యటిస్తూనే ఉన్నారు.

అంతేకాకుండా నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేయతలపెట్టారు. కానీ.. మధ్యలోనే అస్వస్థతకు గురవడం, ఉప ఎన్నిక షెడ్యూల్‌ రావడంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈటల విషయం ఇలా ఉంటే.. ఎలాగైనా హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని కేసీఆర్‌ నిశ్చయించుకున్నారు. అందుకు ప్రత్యేక ప్యాకేజీలు, పథకాలు లాంటివి ప్రవేశపెడుతూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉప ఎన్నికల కోడ్‌ వచ్చిననాటి నుంచి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుజురాబాద్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు. అంతేకాకుండా ఒక్కో గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జీలుగా నియమించి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారంటే టీఆర్ఎస్‌ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ అధిష్టానం విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ ను తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది.

ఈటల గెలుపు కోసం బీజేపీ జాతీయ నాయకులు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ కూడా తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్‌ నాయకులు తమ అభ్యర్థి గెలుపు కోసం తమ వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు రేవంత్‌ రెడ్డి హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేవంత్‌ రాకతో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో మరింత ఆసక్తి పెరగనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పార్టీల ప్రచారం పక్కన పెడితే.. అసలు ఓటర్లు ఎవరిని గెలిపించనున్నారు..? ఓటర్లను ఎవరు ఎంత మేర సంతృప్తి పరిచారు..? అనే విషయానికి వస్తే.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో సింహ స్థానం ఓటర్లు మహిళలే. మరీ మహిళలను ఒప్పించి.. మెప్పించినవారికే హుజురాబాద్ పీఠం దక్కనుంది అని అర్థమవుతుంది. కానీ.. మహిళలు ఎవరినీ గెలిపిస్తారన్న విషయమే అర్థం కావడం లేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పలు సర్వేలు చేస్తూనే ఉన్నాయి. ఓసారి బీజేపీకి మద్దతుగా వస్తున్న నివేదికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ కు అండగా ఉన్నట్లు తేలుతోంది. అసలు ప్రజలు ఎవరినీ గెలిపించాలనుకుంటున్నారో మాత్రం అర్థమవడం లేదని సర్వే సంస్థలే అంటున్నాయి.

మహిళలు ఎక్కువగా ఉండడంతో మహిళా ఓటర్ల నాడీ పసిగట్టేందుకు చేసిన సర్వేలు కూడా బెడిసికొడుతున్నాయి. ఏ మహిళను పలుకరించినా.. మాకు ఇష్టం ఉన్నవారికే ఓటు వేస్తామంటున్నారే తప్పా.. వీరికి ఓటు వేస్తామని స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో సర్వేలు కూడా పక్కన పడుతున్నాయి. మహిళా ఓటర్లపై దృష్టిపెట్టిన కేసీఆర్‌ సర్కార్‌ వరాల జల్లును కురిపించిన విషయం తెలిసిందే. 160 మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా ఒకేసారి ఇంత మొత్తంలో మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించలేదు. దీనికి తోడు ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఎన్నిక జరుగనున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తారనే భావన లేకపోలేదు.

ఇక ఈటల విషయానికొస్తే.. మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ఈటల సతీమణి ఈటల జమున రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. భర్త గెలుపే లక్ష్యంగా ఈటల జమున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్‌ రెడ్డి ఎలాంటి ప్లాన్‌ వేస్తారో వేచి చూడాలి.. మొత్తం మీద మహిళలు మెచ్చిన వారే హుజురాబాద్‌ గడ్డమీద తమ పార్టీ జెండాను ఎగరవేయనున్నారు. చూడాలి మరీ.. మహిళలు మెచ్చే ఆ నాయకుడెవరో..?