NTV Telugu Site icon

అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

Read Also: సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
★ చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, పాల మీగడ, వెన్న, నువ్వుల నూనె వంటివి చేర్చి శరీరానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానం చేసే ముందు కొబ్బరినూనె పట్టించుకుని గ్లిజరిన్‌ సబ్బు వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి రావు.
★ ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో పెడుతుండాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి అలర్జీల వంటివి దరిచేరనివ్వకుండా ఉంటాయి. బెడ్‌షీట్లను, దిండు గలేబుల్ని కనీసంగా వారంలో రెండుసార్లు మార్చుకోవాలి.
★ చలికాలంలో కొందరికి కాళ్లు పగులుతాయి. అటువంటి వారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసి పాదాల్ని అందులో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకోవాలి.
★ చలికి ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నడి వయసుల వారిని ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అటువంటి వారు ఉదయం, సాయంత్రం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు కాళ్లూ చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి. గర్భిణులు కూడా ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
★ చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి, నీటిని కాచి వడబోసుకుని తాగాలి.