తెలుగు సినిమా దర్శకులలో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకున్న అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు ఎ. కోదండరామిరెడ్డి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన కెరీర్ ను ఓసారి అవలోకించుకుందాం.
నటుడు కావాలని చెన్నయ్ వెళ్ళిన కోదండరామి రెడ్డి తప్పని పరిస్థితులలో రాజీ పడి వి. మధుసూదనరావు దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు. ‘మనుషులు మారాలి’ తో మొదలైన ఆయన కెరీర్ ఎంతోమంది మనుషుల జీవితాలను నిజంగానే మార్చేసింది. కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో నటిస్తే చాలు… విజయలక్ష్మి వరించడం ఖాయం అనే నమ్మకం ఎంతోమంది నటీనటులకు కలిగేలా చేశారాయన. పనిని దైవంగా భావించే కోదండరామిరెడ్డి తన విజయ సోపానానికి సాంకేతిక నిపుణులు, నటీనటులు సైతం కారణమంటారు. 1980లో ‘సంధ్య’ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ చేతికి తీసుకున్నారాయన. తొలి చిత్రం ఘన విజయం సాధించకపోయినా… దర్శకుడిగా మాత్రం కోదండరామిరెడ్డి మంచి మార్కులే పొందారు. నటి సుజాతకు, దర్శకుడిగా కోదండరామిరెడ్డికి ‘సంధ్య’ ఓ చక్కని వెలుగు బాట వేసిందనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘న్యాయం కావాలి’ దర్శకుడిగా కోదండరామిరెడ్డి సత్తాను చూపించింది. అలా మొదలైన ప్రయాణం దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగిపోయింది.
నవలా చిత్రాల దర్శకుడు
ఎ. కోదండరామిరెడ్డి ఒక్క ఎన్టీయార్ తో తప్ప ఎ.ఎన్.ఆర్. మొదలుకొని అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు తీశారు. విశేషం ఏమంటే… చిరంజీవితో ఆయన తీసినన్ని సినిమాలు, నవలా చిత్రాలు వేరెవరూ తీయలేదు. చిరంజీవితో కోదండరామి రెడ్డి దాదాపు 25 చిత్రాలు రూపొందించారు. ‘అభిలాష, ఛాలెంజ్, రక్త సిందూరం, దొంగమొగుడు’ వంటివన్నీ నవలా చిత్రాలే. అలానే కృష్ణతోనూ వసుంధర రాసిన నవల ఆధారంగానే ‘రామరాజ్యంలో భీమరాజు’ చిత్రం తెరకెక్కించారు. కమల్ హాసన్ లో ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమా నవల ఆధారంగానే తీశారు. చిరు – కోదండరామిరెడ్డి అనగానే మొదట ‘ఖైదీ’ గుర్తొస్తుంది కానీ, దానిని మించిన విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్ లో ఎన్నో వచ్చాయి.
ఎ. కోదండ రామిరెడ్డి… చిరంజీవి తర్వాత అత్యధిక చిత్రాలు తీసింది బాలకృష్ణతోనే. ఆయనతో 18 సినిమాలు తెరకెక్కించారు. వీరిరువురి కాంబినేషన్ లో బోలెడన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ‘అనసూయమ్మగారి అల్లుడు’తో మొదలు పెట్టి… వారి విజయయాత్ర ‘బొబ్బలిసింహం’ వరకూ సాగింది. ఇక ఎవర్ గ్రీన్ హీరో అక్కినేనికి, ఆయన కుమారుడు నాగార్జునకూ కూడా సూపర్ హిట్స్ ఇచ్చిన ఘనత కోదండరామిరెడ్డి సొంతం. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఆయన సుమారు 94 చిత్రాలను డైరెక్ట్ చేశారు. చివరగా 2009లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పున్నమి నాగు’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సొంత బ్యానర్ లోనే తన రెండో కుమారుడు వైభవ్ తో ‘గొడవ’ సినిమా డైరెక్ట్ చేశారు కోదండరామిరెడ్డి.
నటుడు కావాలనుకున్న ఆయన కోరికను చిన్న కొడుకు వైభవ్ తీర్చాడనే అనుకోవాలి. తెలుగులో వైభవ్ కు పెద్దంత విజయవంతమైన చిత్రాలు లేకపోయినా… కోలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పటికీ అవకాశం చిక్కాలే శత చిత్ర దర్శకుల జాబితాలో తన పేరును చేర్చడానికి కోదండరామిరెడ్డి సిద్ధంగానే ఉన్నారు. తన తొలి గురువు విక్టరీ మధుసూదనరావు నుండి కథలను ఎంపిక చేసుకోవడంలో నేర్పు సంపాదించుకున్న కోదండరామిరెడ్డి, మలి గురువు రాఘవేంద్రరావు నుండి కమర్షియల్ అంశాలను అందులో ఎలా జోడించాలో తెలుసుకున్నారు. అందుకే ఆయన తోటి దర్శకులు చేయలేని విధంగా ఘన విజయాలను ‘ఖైదీ’ చేయగలిగారు.