మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా ఈసారి గోవా నుంచి తృణమూల్, ఆప్ పార్టీలు కూడా బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికు తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులపాటు గోవాలో పర్యటించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు సంధించారు. గోవాలో మాత్రమే కాకుండా నార్త్‌లో అన్ని రాష్ట్రాల్లో ఇకపై పోటీ చేయబోతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాలు, కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాల కారణంగానే మోడీ మరింత బలంగా మారుతున్నారని, కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అందుకు తాము రంగంలోకి దిగుతున్నామని మమతా బెనర్జీ ప్రకటించారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా గోవా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గోవాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గోవా ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
వేడెక్కుతున్న గోవా… ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీలు
