ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది.. ఆ తర్వాత పౌడర్ రూపంలో కూడా మరో మందు మార్కెట్‌లోకి వచ్చింది.. ఇక, త్వరలోనే ముక్కు ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చు.. ఎందుకంటే… కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో ముందడుగు వేసింది… ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాజల్ వ్యాక్సిన్) మరో దశ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ తెలిపింది.
కాగా. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వారిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ చేసింది భారత్ బయోటెక్… తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడంతో.. ఇక, రెండో దశ, మూడో దశపై దృష్టిసారించింది. మరోవైపు.. కరోనాపై పోరాటంలో తానుసైతం అంటూ.. ఇప్పటికే ‘కొవాగ్జిన్’ పేరుతో టీకాను తీసుకొచ్చింది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ154- అడెనోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్)పై ఫోకస్ పెట్టింది.