మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాక్కున్నా, తలగడ అడ్డం పెట్టుకున్నా, కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిదారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది.
ఛత్రినాక ఇన్స్పెక్టర్సయ్యద్ అబ్దుల్ ఖాదర్జిలానీ వివరాలు అందచేశారు. గౌలిపురాకు చెందిన జి. అశోక్‌కు ఇద్దరు సంతానం. ఒక కుమారుడు (8), కుమార్తె. అశోక్ట్రూప్ బజార్లో ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడని అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అశోక్‌కు భార్య చెప్పింది. తాగిన మత్తులో ఉన్న అశోక్కన్న కొడుకుపై వీరంగం సృష్టించాడు. కట్టెతో ఇష్టం వచ్చినట్టు రెండున్నర నిమిషాలపాటు చితకబాదాడు.
ఇదంతా కూతురు సెల్ఫోన్లో రికార్డు చేస్తూనే … కొట్టొద్దు పప్పా అంటూ బ్రతిమిలాడింది. బాలుడి ఒళ్లంతా హూనం కావడంతో తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి జీజాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసకున్న పోలీసులు తండ్రి అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన కొడుకుకు బుద్ధి చెన్నానని సాక్ష్యం చూపించేందుకు కూతురుతో వీడియో తీయించి అందరికి తండ్రి అశోక్ వీడియో షేర్ చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.