దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు.
గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను చేస్తామంటూ కేంద్రంలో బీజేపీ.. తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు అంటూ టీఆర్‌ఎస్ పార్టీలు వాగ్దానాలు చేశాయి. వీరి మాటలు నమ్మిన రైతులు కూడా ఈ ప్రభుత్వాలతో మా బతుకులు మారుతాయనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. తిరిగి రెండోసారి అధికారం అప్పగించారు. తీరా ఇప్పుడు మేము రైతులకు న్యాయం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం చేయనివ్వడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలే రోడ్డెక్కారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలేమో రాష్ట్ర ప్రభుత్వానికి సత్తా లేక కేంద్రాన్ని తప్పుపడుతోందని ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణలో రాజకీయం రగులుతోంది. మధ్యలో నలుగుతున్నది మాత్రం రైతన్నే.
అయితే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం… కేంద్రంపై రాష్ట్ర అధికార పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి డీలా పడ్డ మా బతుకులకు న్యాయం చేస్తారేమోనని వీరిని నమ్ముకుంటే వీళ్లేమో ఒకరిపై ఒకరి మాటల యుద్ధం చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలే ఈ విధంగా మాట్లాడితే మా పరిస్థితి ఏంటంటూ.. రైతులు ఆగమైపోతున్నారు.