ఆయన కేంద్ర మాజీ మంత్రి. అనువంశికంగా వచ్చిన హక్కులను పోరాడి సాధించుకున్నారు. హోదాతోపాటు ఇటీవల ఓ కారు కాంపౌండ్‌లోకి వచ్చింది. ఆ.. వాహనం ఎక్కాలంటేనే పెద్దాయన తెగ టెన్షన్ పడుతున్నారట. కోరి తెచ్చుకున్న ఆ కారు కష్టాలేంటో ఓ లుక్కేయండి.
అశోక్ గజపతిరాజు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా.. ప్రతి పక్షంలో వున్నప్పుడు సైలెంట్‌గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంట్రవర్సీకి ఆస్కారం వచ్చిన సందర్భాలు అరుదే. ఇదంతా 2020కి ముందుమాట కాగా ఇప్పుడు అశోక్ అంటేనే రాజకీయ వేడి. అమీతుమీ తేల్చుకోవాలని దూకుడుగా ఎత్తుగడలు వేస్తున్నారు. అధికారపార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా లెక్క చేయడం లేదు. అయితే రాజుగారు అడిగి మరీ తెప్పించుకున్న ఓ కారు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ధర్మకర్తను ఇరకాటంలోకి నెట్టేసిందని లోకల్ టాక్.
రాజుగారి బంగళాకు చేరిన సింహాచల ఆలయం సమకూర్చిన ఇన్నోవా..!
చైర్మన్‌కు గౌరవ సూచికంగా సింహాచలం దేవస్థానం సమకూర్చిన ఇన్నోవా వాహనం ఇదే. హైకోర్టు ఆదేశాల ద్వారా అనువంశిక ధర్మకర్తగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన అశోక గజపతి.. ఛైర్మన్ కోసం కేటాయించే కారును పంపించాలని ఈవోకు లేఖ రాశారు. మొదట్లో పెద్దగా స్పందన రాకపోగా.. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన సుమారు 40రోజులకు AP31EP1701 నెంబర్ కలిగిన ఇన్నోవా రాజుగారి బంగ్లాకు చేరింది. ఇదిజరిగి దాదాపు 4 నెలలు దాటినా ఆ కారు చెట్ల కిందే ఉంది. అశోకగజపతిరాజు సింహాచలం వచ్చినా.. మాన్సాస్ పనులపై వెళ్లినా వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీనివెనక బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ అతికించడంతో అనుమానిస్తున్నారా?
సింహాచలం దేవస్థానం సమకూర్చిన ఇన్నోవాపై ఎటువంటి నేమ్‌బోర్డు లేదు. అది ఛైర్మన్ కారుగా గుర్తించడంతోపాటు ఈ వాహనం సింహాచలం దేవస్థానానికి చెందినదిగా ఉండాలి. గతంలో ఛైర్మన్లుగా వ్యవహరించిన అందరికీ ఈ పద్ధతి పాటించగా.. సంచయితకు 75వేల రూపాయలు రవాణా ఖర్చుల కోసం కేటాయించినట్టు సమాచారం. ఇప్పుడు తన దగ్గరకు వచ్చేసరికి గత సంప్రదాయాలు ఎందుకు పాటించడంలేదని ఈవోను నిలదీశారట అశోక్. దీంతో ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ అతికించి పంపించారట. ఇంకేముందీ రాజుగారిలో కొత్త అనుమానాలకు కారణమైందట.
ఆ వాహనంలో రోడ్డెక్కితే రచ్చ చేస్తారని సందేహం
ప్రభుత్వ వాహనంలో అధికారికంగా ప్రయాణించే అవకాశం.. హోదా ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి ఉండదు. సింహాచలం దేవస్థానం ఆస్తి అంటే నేరుగా ప్రభుత్వానికి చెందినది కాదు. సర్కార్ నియంత్రణలో ఉన్న దేవస్థానానికి సంబంధించినది. ప్రస్తుతం అశోక్ వర్సెస్ ప్రభుత్వం అని వాతావరణం హాట్‌హాట్‌గా ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వ వాహనం అనే బోర్డు పెట్టుకుని రోడ్డెక్కితే దానినీ ఓ కారణంగా చూపించి రచ్చ చేస్తారనే అనుమానం పెద్దాయన్లో ఉందని అశోక్ బంగ్లాతో అనుబంధం ఉన్న వాళ్లు చెప్పేమాట. దీంతో కోరి తెప్పించుకున్న కారును కూడా అనుమానించే పరిస్థితి తలెత్తిందట.
ప్రభుత్వంపై అశోక్ మండిపాటు..!
వైసీపీ ప్రభుత్వంతో అశోకగజపతి వైరం 2020 మార్చిలో ప్రారంభమైంది. రాత్రికి రాత్రి మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం సహా 108దేవాలయల అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి అశోక్‌ను తప్పించి ఆ స్థానంలో సంచయితను కూర్చోబెట్టింది. ఇందుకోసం జారీ చేసిన జీవో నెంబర్ 72పై న్యాయ పోరాటం చేశారు. అప్పటి నుంచి అశోకగజపతిరాజు కేంద్రంగా రాజకీయం సెగలు రేపుతోంది. మాన్సాస్ విద్యాసంస్థల వ్యవహారంలో కేసులు పెట్టడం, రామతీర్థం వివాదంలో మలుపులు.. ఆ సెగల్లో భాగమేననేది ఓపెన్ సీక్రెట్. ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు అశోక్‌గజపతి.
లేఖలు.. కోర్టు ఆదేశాలతో నిర్ణయాల అమలు?
సింహాచలం, మాన్సాస్ ట్రస్టులపై పట్టు బిగించేందుకు అశోకగజపతిరాజు చేస్తున్న ప్రయత్నాలకు ఎగ్జిక్యూటివ్ అధికారుల సహాయ నిరాకరణ ప్రతిబంధకంగా మారింది. దీంతో ఆయన లేఖలు రాయడం, కోర్టు నుంచి ఆదేశాలు పొందడం ద్వారా నిర్ణయాలను అమలు చేయించుకుంటున్నారు. ఈ విధంగానే ఛైర్మన్ కోసం కేటాయించే కారును పొందినా.. దానిని ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. మరి.. ఈ టెన్షన్ నుంచి బయటపడి రాజుగారు కారెక్కుతారో లేదో చూడాలి.