హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నాయకులు చాలా కాలంగా హుజురాబాద్‌లో మకాం వేసి రాజకీయం నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో వారంతా పోలింగ్ ముందు కీలక సమయంలో అక్కడ ఉండే అవకాశం లేకుండా పోతుంది.
బయటి నుంచి వచ్చిన పలువురు నేతలు చాలా రోజులుగా ఇక్కడే మకాం వేసి వ్యూహాలను అమలు చేయటంతో పాటు వ్యక్తిగతంగా వాటిని పర్యవేక్షిస్తున్నారు. ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. శనివారం ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో స్థానికేతర నేతలంతా బుధవారం సాయంత్రంలోగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వీడాల్సి ఉంటుంది. దీంతో వ్యూహకర్తల చేతులు కట్టేసినట్టవుతుంది. ఐతే, వారు భౌతికంగా అక్కడ లేకపోయినా ఫోన్ ద్వారా కథ నడిపించనున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు మూడు పార్టీలకు చెందిన వ్యూహకర్తలు తమ స్థానిక నాయకుల ద్వారా ఓటర్లతో కనెక్టవుతారు. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందిస్తున్నారు ఇప్పుడు.
ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఎంత ముఖ్యమో…పోలింగ్ ముందు మూడు రోజులు అంతకన్నా కీలకం. ఆ సమయంలోనే స్థానిక నాయకులు, స్లీపర్ సెల్స్ మరింత చురుకుగా ఉంటారు. డబ్బు, మద్యం, ఉచిత పంపిణీలు అన్నీ వారి ద్వారానే చేతులు మారుతుంది. అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మూడు పార్టీలకూ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఐతే, అధికార పార్టీపై మరింత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, లౌడ్‌స్పీకర్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు వంటి వాటిని పోలింగ్‌కు 72 గంటల ముందు చుట్టేయాల్సి వుంటుంది. అయితే గతంలో ఇది 48 గంటల ముందు జరిగేది. ఏ నిబంధనలనైనా కచ్చితంగా అమలు చేస్తారని ఎన్నికల అధికారులకు పేరుంది. దాంతో బుధవారం రాత్రి 7 గంటలలోపు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఐతే, స్థానిక నాయకులు మాత్రం పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్ధించ వచ్చని రాష్ట్ర ఎన్నికల అధికారి శాశాంక్ గోయల్ చెప్పారు.
బయటి నంచి వచ్చిన నాయకులు పథకాలంటూ .. హామీలంటూ ..ప్రాజెక్టులంటూ ఓటర్లకు మాయ మాటలు చెప్పి ఎన్నికల తరువాత పత్తాలేకుండా పోతారని హరీష్ రావుపై ఈటల సెటైర్లు వేస్తున్నారు. ఐతే హరీష్ మాత్రం ప్రతినెలా స్వయంగా హుజూరాబాద్‌లో పర్యటించి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానంటున్నారు.
కొత్త నిబంధనకు తగ్గట్టుగా పార్టీలు రూటు మారుస్తున్నాయి. ముందుగా నియోజకవర్గంలోని ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించే పనిలో పడ్డారు కార్యకర్తలు. బుధవారం తరువాత ఫోన్ చేసి ఓటు అడగటానికే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే నగదు పంపిణీలో ఏమైనా ఇబ్బంది ఏర్పడితే ఫోన్ నంబర్ ఉపయోగించి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే, ఉపాధి కోసం వేరే ప్రాంతాలలో ఉన్న వారిని రప్పించేందుకు కూడా ఫోన్ నంబర్లు అవసరం.
అయితే ఇప్పటి వరకు ప్రచార సరళిని చూస్తే ముఖ్య పార్టీలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఐతే, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యనే అని జనం అంటున్నారు. అయితే ఎవరు గెలుస్తారంటే మాత్రం మౌనమే సమాధానమవుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పబ్లిక్ పల్స్ తెలిసేది ప్రచారానికి వెళ్లిన వారికి. ఇప్పుడు వారు మనసులోని మాట పెదవి దాటనివ్వటంలేదు. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా వెళుతున్నారు. దాంతో ఓటరు నాడి పట్టుకోలేక నేతలకు కష్టంగా మారింది. సర్వే సంస్థలకు కూడా ఓటరు నాడి అంతుబట్టటం లేదు. ఇంటెలిజెన్స్ కూడా చేతులెత్తేసింది. కాబట్టి.. సైలెంట్‌గా ఉన్న హుజురాబాద్ ఓటరు వయిలెంట్ తీర్పు ఇస్తారా అన్న అనుమానం కలుగుతోంది!!