(జూలై 1న కేవీ రెడ్డి జయంతి)
చారిత్రకంతోనే తొలి ఢీ
జానపదాలలో గారడి
పురాణాలతో భలే సందడి
సాంఘికాలలోనూ సవ్వడి
ఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు అప్పట్లోనే విప్పి చెప్పిన తెలుగువారి ఇబ్సన్ కూడా ఆయనే!
కొందరు ఏది చేసినా భలే బాగుంటుంది. మరికొందరు ఎన్ని తీసినా చూడలేం. కేవీ రెడ్డి తీసిన చిత్రాల జయాపజయాలను పక్కకు పెడితే, ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అధికశాతం ఆకట్టుకున్నవే! నాటకఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరమని కేవీ భావించారు. అంతకు ముందు మన సినిమాల్లో నాటకఫక్కీనే పలకరించేది. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చినవారే! అయితే వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు కేవీ. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. అమ్మవారి అనుగ్రహంతో కడదాకా జనం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించారు కేవీ.
‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరు మేరునగ సమానులైన నటులతో అలరించిన కేవీ రెడ్డి, ఆ తరువాత ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయారు. ‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. అవి కేవీ తీసిన చిత్రాలే, కానీ, వాటిలో ఆయన ఠీవి కనిపించలేదన్నదే అభిమానుల ఆవేదన. కొందరు కేవీ పని అయిపోయిందన్నారు. మరికొందరు ఆయన గత చిత్రరాజాలనే తలచుకొని పులకించిపోయారు. మళ్ళీ ఏ మాయాబజారునో, లేదా ఏ జగదేకవీరుని కథనో వినిపిస్తారని ఆశించారు. అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున కేవీ మునుపటి వైభవం చూపిస్తారనే విశ్వసించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘శ్రీకృష్ణ సత్య’ను తెరకెక్కించారు కేవీ. మళ్ళీ ఆయన ఠీవి నిలచింది. ‘శ్రీకృష్ణ సత్య’నే ఆయన చివరి చిత్రం. విచిత్రమేంటంటే- ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ, ఈ తెరకృష్ణుడు నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’తోనే చిత్ర ప్రయాణం ముగించడం! ఏది ఏమైనా విజయంతో మొదలైన కేవీ సినీయానం సక్సెస్ తోనే ముగియడం అభిమానులకు ఆనందం పంచింది. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. అందుకే కేవీ రెడ్డి పేరు ఇంకా ఠీవీగానే చిత్రసీమలో నిలచి ఉందని అంటారు! కాదంటారా!?