మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది.
మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఛత్తీస్ గడ్ ఒరిస్సా రాష్ట్రంలో జవాన్లతో కలిసి జింక కూంబింగ్ చేస్తోంది. ఒడిశా లోని కోరాపుట్ జిల్లాకి సరిహద్దున ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుస్తారం లో ఈ వింత చోటు చేసుకొంది.
మావోయిస్టులకు గట్టి బలం ఉన్న ఆ దుర్గమ అడవిలో కూంబింగ్ కి వెళ్లిన జవానులు ఒక గాయపడిన జింక ని రక్షించారు. తమ క్యాంప్ కి తీసుకొని వెళ్లి సంరక్షణ చేశారు. ఇప్పుడు ఆ జింక ప్రతి రోజు జవాన్లతో కలసి కూంబింగ్ కి వెళ్లి తిరిగి క్యాంప్ కి వస్తుంటుంది. దానికి బ్యూటీ అని పేరు పెట్టారు జవాన్లు.