హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు ఫీవర్ పట్టుకుంది. కొద్ది రోజులుగా లబ్ధిదారులు బ్యాంకుల ముందు బారులుతీరుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకుకు తరలివస్తుండటంతో కొన్ని సార్లు పరిస్థితి గంధరగోళానికి దారితీస్తోంది.
చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవలన్న ఆసక్తితో బ్యాంకుకు వెళుతున్నారు. దళితబంధుపథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 23 వేల మంది అర్హులను గుర్తించింది. అయితే ఇప్పటి వరకు 16 వేల ఖాతాలు మాత్రమే తెరిచారు. ఏడు వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఇంకా తెరవకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన అందరికీ వారు ఇష్టపడే వ్యాపార యూనిట్లకు సంబంధించిన నిధులు, లావాదేవీలను లింక్ చేయడానికి ప్రభుత్వం కొత్త ఖాతాలను తెరవాలని నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం కావచ్చు.
దళిత బంధు స్కీంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఖాతాల్లో 9 లక్షల 90 వేలు జమ చేశారా లేదా అనే దాని పై ఆరా మొదలైంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో తమకు రావల్సిన డబ్బులు రావేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఈ మేరకు ప్రచారం కూడా జరగడంతో లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు కోసం డబ్బులను కలెక్టర్ అకౌంట్‌కు బదిలీ చేసింది. అయినప్పటికీ తమ చేతికి రాకపోతే ఎలా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
వ్యాపారం చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్నా తన అకౌంట్‌కు డబ్బు రాలేదని కొందరు అంటున్నారు. అకౌంట్లో డబ్బు జమ అయినట్టు మొబైల్‌కు మెసేజ్ వచ్చినా ఖాతాలో మాత్రం డబ్బు డిజాజిట్ కాలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నిక ఇటు టీఆర్‌ఎస్, అటు బీజేపీకి సవాలుగా మారటంతో నియోజకవర్గంలో నిధుల వరద పారుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మారనుందంటున్నారు పరిశీలకులు. పార్టీలు ఖర్చు పెట్టేది ఎంతో అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు, పథకాల కోసం దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా!!