ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరానికి తుఫాన్ చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్‌కు జవాద్‌గా నామకరణం చేసిన సంగతి విదితమే.
Read Also: ‘జవాద్’ ముప్పు.. ఆ జిల్లాల అధికారులకు కీలక సూచనలు
మరోవైపు తీవ్రవాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో శుక్రవారం నాడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈరోజు అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. శనివారం ఉదయం గంటకు 70-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీంతో తీర ప్రాంత వాసులు ఊరూరా దండోరా వేసుకుని అప్రమత్తం చేసుకుంటున్నారు. అటు మండల కేంద్రాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.
జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ నాలుగే జిల్లాల్లో అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసి.. స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఈ నాలుగు జిల్లాలకు NDRF, SDRF బృందాలు ఇప్పటికే చేరుకోగా.. తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండేను ప్రభుత్వం నియమించింది. తూర్పు గోదావరి జిల్లాకు జవాద్ తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్-18004253077, కాకినాడ ఆర్డీవో-0884-2368100, అమలాపురం ఆర్డీవో-08856-233208, రామచంద్రాపురం ఆర్డీవో-6304353706, పెద్దాపురం ఆర్డీవో-9603663227, రాజమహేంద్రవరం-0883-2442344, రంపచోడవరం-08864-243561, ఎటపాక-08864-285999.