Collector: స్కూళ్లు, కాలేజీలు సహజంగా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ప్రారంభమవుతుంటాయి. ఇది చాలా చిన్న విషయం. ఎవర్ని అడిగినా చెబుతారు. కానీ కేరళలోని ఎర్నాకులం జిల్లా కలెక్టర్ రేణురాజ్ మాత్రం ఈ సంగతి తెలిసో తెలియకో గజిబిజీ అయిపోయి జిల్లాలోని విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను గందరగోళంలో పడేశారు. పిల్లలతోపాటు పేరెంట్స్‌ని కూడా ఇబ్బందిపెట్టి తీవ్రంగా విమర్శల పాలయ్యారు. విషయం ఏంటంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కురిసినట్లే కేరళలోనూ విపరీతంగా వానలు పడుతున్నాయి. వాతావరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో జిల్లాకు పాలనాధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత ముందుచూపు ప్రదర్శించాలి?. పైగా ఆమె యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్. ఎంత చురుకుగా నిర్ణయాలు తీసుకోవాలి?. కానీ రేణురాజ్ మాత్రం ఆ రోజు అంత యాక్టివ్‌గా ఉండలేకపోయారు. స్థిరత్వాన్ని ప్రదర్శించకుండా గంటకొక విధంగా వ్యవహరించి అనవసరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యారు. ఈ నెల 4వ తేదీన ఎర్నాకులం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించటంలో కలెక్టర్ రేణురాజ్ తడబాటుకు గురయ్యారు. ఉదయం ఎనిమిదిన్నరకు హాలిడే అని అనౌన్స్ చేశారు. 45 నిమిషాలు కూడా గడవక ముందే మాట మార్చారు.
Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త
‘ఎనిమిదిన్నరకే స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమై ఉంటే క్లాసులు కొనసాగించొచ్చు’ అంటూ రెండో స్టేట్మెంట్ ఇచ్చారు. సెలవు ప్రకటించటంతో పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్‌కి వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పెట్టాయి. స్టూడెంట్స్‌ని తీసుకెళ్లాలంటూ అలర్ట్ చేశాయి. ఆ సందేశాలు చూసి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొద్దామని వెళ్లిన పేరెంట్స్ ఈలోపు రెండో అనౌన్స్‌మెంట్ రావటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్ గారూ ఏంటిది అంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నిలదీశారు. కేరళలోని సీబీఎస్‌ఈ స్కూల్స్ కౌన్సిల్ సైతం స్పందించింది. సెలవు ఇవ్వాలనుకుంటే ఉదయం 7 గంటల లోపే ప్రకటన చేయాలని సూచించింది.
కొన్ని స్కూల్ బస్సులు పొద్దున్నే 6 గంటలకే స్టార్టయి దూర ప్రాంతాల్లోని పిల్లలను పికప్ చేసుకుంటాయని, అందువల్ల అంతకన్నా ముందే హాలిడే డిక్లేర్ చేస్తే ఇంకా బెటరంటూ కలెక్టర్‌కి ఏకంగా లెటర్ రాసింది. ఈ గజిబిజి పైన కలెక్టర్ రేణురాజ్ రియాక్ట్ అయ్యారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టే తాను నిర్ణయం తీసుకున్నానని, ఎర్నాకులానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించకపోవటంతో సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నట్లు తెలిపారు. వెదర్ అలర్ట్ ఆరెంజ్ నుంచి రెడ్‌కి మారినట్లు వాతావరణ శాఖ ఆలస్యంగా ప్రకటించటంతో గంట వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని వివరణ ఇచ్చారు.