ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ప్రగతిలో ఏపీ నంబర్ వన్ అని ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైనట్లు ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి అని తెలిపారు. ఈ సారి రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని విజయ్‌కుమార్ వెల్లడించారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని వివరించారు. ఇక, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 36 శాతం కంట్రీబ్యూషన్ వ్యవసాయం నుంచి వస్తోందన్నారు.
Also Read: Village Road Bridge: వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి.. మర్రిచెట్టే వారికి వంతెన
కాగా, ఈ నెల 16న సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 19న ఆదివారం, 22న ఉగాది సెలవు ఇవ్వనున్నారు. ఈ నెల 24తో సమావేశాలు ముగియనున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ఇది పూర్తి స్థాయి చివరి బడ్జెట్ కావడంతో 2 లక్షల 60 వేల కోట్లు ఉండవచ్చని అంచనా. ఈసారి బడ్జెట్ లో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఉండవచ్చు. మూడు రాజధానుల అంశం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండవచ్చు అని తెలుస్తోంది. జులై నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది.