ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కరోనా కేసులు, కొత్త వేరియంట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఆ దేశం స్పష్టంగా బయటపెట్టడం లేదు. రెండు మూడు కేసులు బయటపడినా నగరాలను లాక్ డౌన్ చేస్తున్నది. తాజాగా యుజ్హౌ నగరంలో లాక్ డౌన్‌ను విధించారు. 1.2 మిలియన్ జనాభా కలిగిన యుజ్హౌ నగరంలో బయటపడింది కేవలం 3 కరోనా కేసులే. అయినప్పటికీ లాక్‌డౌన్‌ను విధించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్…
గత కొన్ని రోజులుగా జియాంగ్ సిటీలోనూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు ఆ నగరంలో 1600 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా కట్టడి విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నది ప్రభుత్వం. కరోనా కట్టడిలో విఫలమైన అధికారులను విధుల నుంచి తొలగిస్తున్నారు. మరో నెల రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించినా క్రీఢాకారులు పాల్గొనేందుకు చైనా వస్తారా అన్నది సందేహమే.