ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా చేస్తూ ప్రకటించారు. రాజధాని అభివృద్ధి కోసం రైతుల నుంచి ఎన్నో ఎకరాల భూములను సేకరించారు.
అయితే ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏపీలో 3 రాజధానులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. వైసీపీ ప్రకటనతో ఒక్కసారిగా ఏపీలో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రకటన కొందరు తీపి కబురుగా తోచినా.. కొందరి చెవికి మాత్రం వినసొంపుగా వినిపించలేదు. ఏపీలో ఒకేఒక్క రాజధాని ఉండాలని.. అదికూడా అమరావతి మాత్రమే ఉండాలంటూ అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా 45 రోజుల పాటు మహాపాదయాత్ర నిర్వహించి నేడు తిరుపతిలో భార బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థులు సత్తాచాటి విజయభేరి మోగించారు.
ఎన్నికల ఫలితాల సందర్భంగా విజయోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ నేతలు సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని.. అందుకే వైసీపీని గెలిపించారంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ వైసీపీ విజయపతాకం ఎగురవేసింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వివాదస్పద ఘటనతో ఇక నేను ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానని చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. అంతేకాకుండా 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం చేసుకొని ఆయన భవిష్యత్ కార్యచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే అమరావతి రైతులు 3 రాజధానుల, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో భారీ బహిరంగం సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు బీజేపీ చీఫ్ లక్ష్మీనారాయణ, జనసేన, కాంగ్రెస్ తో పాటు వామపక్షనేతలు హజరుకానున్నారు. వైసీపీపై పోరుకు చంద్రబాబు ఈ పార్టీలతో కూడిన మహాకూటమి తయారు చేసుకొని వచ్చి ఎన్నికల్లో దండయాత్ర చేస్తారా..? అమరావతి రైతుల మహాసభను చంద్రబాబు మహాకూటమిని కలిపి వేదికగా మలుచుకుంటారా..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.