సామాన్యుడి నడ్డి విరిచేలా.. ప్రతీ వస్తువుపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భారం పడేలా పెట్రో ధరలు వరుసగా పెరిగిపోయాయి.. అయితే, దీపావళికి ముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం.. ఆ తర్వాత క్రమంగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలి రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.. అంతే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా తగ్గించాల్సిందేనంటూ ఒత్తిడి పెరిగుతోంది.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే, ఇంత కాలం భారీ స్థాయిలో దోపిడీ చేసి.. కంటితుడుపు చర్యగా కొంత కోత పెట్టారనే విమర్శలు కేంద్రంపై లేకపోలేదు.. ఇదే సమయంలో.. పెట్రో భారం మోపుతూ వచ్చింది కేంద్రమే.. మరింత ఉపశమనం కలిగించాల్సిందే కూడా కేంద్ర ప్రభుత్వమే అని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.. మరి పెట్రోల్, డీజిల్‌పై సుంకాల రూపంలో ఎవరికి ఎంత వెళ్తుంది..? కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రాలు ఎంత ఆదాయం పొందుతున్నాయి..? అనే చర్చ సాగుతోంది..? దీనిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వివరణ కూడా ఇచ్చింది.
రాజ్యసభలో మంగళవారం రోజు ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.. దీని ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది.. అంతే ఆ మొత్తం 3.72 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.. అయితే, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా 41 శాతం. .అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా 41 శాతం తీసినా.. కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉంటుంది.. రాష్ట్రాలకు కేంద్రం ఈ 41 శాతం పన్నుల వాటాలో ఏ రాష్ట్రానికి ఎంతివ్వాలి అనేది మాత్రం ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది… దాని ప్రకారం రాష్ట్రాలకు ఆ మొత్తం కేంద్రం బదిలీ చేస్తుంది… అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి 1,52,520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్రం మాత్రం మొండిచేయే చూపింది.. కేవలం రూ. 19,972 కోట్లు మాత్రమే చెల్లిందింది.. ఈ లెక్కన ఏకంగా 1,32,548 కోట్లను కేంద్రం వద్దే ఉన్నాయి..
ఇక, రాష్ట్రాలకు కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకంలో మాత్రమే వాటా ఉంటుందని కేంద్రం చెబుతోంది.. ప్రస్తుతం ఈ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.1.40గా ఉంటే.. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ.11, రోడ్లు, మౌలిక వసతుల సెస్సు కింద రూ.13, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సు కింద రూ.2.50 వసూలు చేస్తున్నారు. ఇదంతా కేంద్రం ఖాతాలోకి వెళ్లిపోతుంది.. రాష్ట్రాలకు వాటా ఉండదు.. అలాగే డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.1.80గా ఉండగా.. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద 8 పైసలు, రోడ్డు మౌలిక వసతుల సెస్సు కింద నాలుగు పైసలతో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్సును కూడా విధిస్తోంది కేంద్రం.. అంటే.. కేంద్ర ప్రభుత్వ పెట్రోల్, డీజిల్‌లపై వసూలు చేసే పన్నును ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నేరుగా వసూలు చేస్తే… రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. కానీ, ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నామమాత్రంగా చూపి… మిగతా పన్నును అంతా వివిధ సెస్సుల రూపంలో చూపెడుతూ రాష్ట్రాలకు వాటా దక్కకుండా చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.