తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీబీఐ.. హైదరాబాద్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే కాగా.. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారంటూ వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.. అయితే, ఈ కేసులో ఈ నెల 15న విచారణకు హాజరుకావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.. కానీ, అనారోగ్య కారణాలతో విచారణకు రాలేకపోతున్నానని శివశంకర్ రెడ్డి తెలిపారు.. ఈ నేపథ్యంలో నిన్న శివ శంకర్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
Read Also: టమాటా మాయం..! మార్కెట్‌లో కనిపించడంలేదు..!
ఉస్మానియా ఆస్పత్రిలో శివశంకర్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటి దగ్గర హాజరుపర్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించింది.. ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీబీఐకి దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు లేఖ రాశారు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో మా నాన్నకు ఎటువంటి సంబంధం లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. మూడు రోజుల కిందట మా నాన్న భుజానికి శస్త్ర చికిత్స జరిగిందని.. ఆ నొప్పితో ఇంకా బాధపడుతున్నారని.. ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేక పోతున్నారని వివరించారు.. మాకు న్యాయం చేయండి అంటూ లేఖలో సీబీఐని కోరారు శంకర్‌రెడ్డి కుమారుడు..