హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపుకోసం పలు సంక్షేమ పథకాలు, వరాలు కురిపించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్‌ను అధిష్టానం నిలబెట్టి ప్రచారం నిర్వహిస్తోంది.
ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినవాటి నుంచి ఆయా పార్టీల నాయకులు వారి వారి అభ్యర్థులను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అయితే పోలింగ్ ఈ నెల 30న నిర్వహించనున్నారు. పోలింగ్‌కు 72 గంటలకు ముందే రాజకీయ పార్టీలు తమ ప్రచారంను ముగించాలనే నిబంధన ఉంది. దీంతో ఈ రోజు సాయంత్రం 7గంటలతో ఉప ఎన్నిక ప్రచారంకు ఇచ్చిన గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు తెర ముందు ప్రచారం నిర్వహించిన నేతలు, రేపు, ఎల్లుండి తెర వెనుక ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను తమ వైపుకు మళ్లించుకునే ప్రయత్నం చేస్తారని.. అంతేకాకుండా డబ్బులు, మద్యం ఓటర్లకు పంచేందుకు వివిధ రకాల వ్యూహాలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం పక్కన పెడితే.. ఎన్నికల సంఘం నిర్వహించే కార్యక్రమాల గురించి చెప్పకుంటే.. ఈ నెల 30 పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 29న ప్రీ పోల్ నిర్వహించి ఈవీఎంలను సంబంధిత పోలింగ్ ఆఫీసర్లకు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది ఈనెల 29న వారికి ఇచ్చిన ఈవీంఎంలను తీసుకొని వెళ్తారు. పోలింగ్ డే రోజు ఉదయం పోలింగ్ సిబ్బంది వారికి ఇచ్చిన ట్రైనింగ్ ఆధారంగా ఈవీంఎంలను ఏర్పాటు చేసుకొని పోలింగ్ ప్రక్రియ ఆ రోజు సాయంత్రానికి ముగిస్తారు.
పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ జరిగిన ఈవీంఎంలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వాహనంలో భారీ భద్రత నడుమ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. అక్కడ రెండు రోజుల తరువాత నవంబర్ 2న ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రానికి ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరెన్ని ఓట్లు సాధించారని.. గెలుపెవరిదో ప్రకటిస్తుంది. ఆ ప్రకటనతో హుజురాబాద్ ఉప ఎన్నికపై ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది.