కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వాటితో దీర్ఘకాలంలో రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతూ వస్తోంది.. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా.. మొదట్లో చర్చలు జరిపినట్టే జరిపి.. ఆ తర్వాత లైట్ తీసుకుంది కేంద్రం.. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు వరుణ్ గాంధీ… రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని సూచించిన ఆయన.. కిసాన్ పంచాయత్‌లను సమర్ధించారు. రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాలని సూచించారు.
కాగా, ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన.. రైతులు మన సొంత మనుషులు.. గౌరవప్రదంగా వారితో తిరిగి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.. రైతుల బాధను అర్ధం చేసుకోండి.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి అంటూ ట్వీట్ చేశారు వరుణ్ గాంధీ.. అయితే, కేంద్ర సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఢిల్లీ సరిహద్దుల్లో 9 నెలలుగా నిరసన కొనసాగిస్తున్నాయి రైతు సంఘాలు.. ఇప్పుడు వరుణ్ గాంధీ రైతులకు మద్దతు ప్రకటించడంతో బీజేపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.