హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల.. ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి మరోసారి గెలుపొందారు. రాజేందర్ 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. అయితే, వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఆయన.. ఎవరిపై సాధించారు.. ఎంత మెజార్టీ దక్కిందనేది ఓసారి పరిశీలిద్దాం..
2004లో తొలిసారిగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈటల.. ఆయనకు 68,393 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డికి 48,774 ఓట్లు వచ్చాయి.. దీంతో.. ఈటలకు 19,619 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక, 2008లో మరోసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనకు 54,092 ఓట్లు వచ్చాయి.. ఈ సారి ముద్దసాని దామోదర్ రెడ్డికి 31,808 ఓట్లు రావడంతో.. ఈటల మెజార్టీ 22,284కి పెరిగింది. ఇక, తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో ఉప ఎన్నికల్లో పోటీచేయగా 56,752 ఓట్లు వచ్చాయి.. ఆయనపై పోటీచేసిన కృష్ణమోహన్ వకులాభరణంకు 41,717 ఓట్లు పోల్ అయ్యాయి.. అప్పుడు 15,035 ఓట్ల మెజార్టీ దక్కింది.
ఇక, 2010 ఉప ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు 93,026 ఓట్లు రాగా.. ముద్దసానికి 13,799 ఓట్లు మాత్రమే వచ్చాయి.. ఈ ఎన్నికల్లో 79,227 ఓట్ల భారీ మెజార్టీతో విజయం ఢంకా మోగించారు ఈటల.. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 95,315 ఓట్లు సాధించారు.. ఆయన సమీప ప్రత్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డికి 38278 ఓట్లు రాగా.. ఈటలకు 57,037 ఓట్ల మెజార్టీ దక్కింది. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఈటలకు 1,04,840 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు సాధించారు.. ఈ సారి ఈటల మెజార్టీ 43,719గా ఉంది. ఇక, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సారి జరిగిన ఉప ఎన్నికల్లో.. ఈటెల రాజేందర్‌కు 1,06,213 ఓట్లు పోలయ్యాయి.. అధికార పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,348 ఓట్లు రాగా.. ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా.. వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు ఈటల.. పార్టీ మారినా.. తనపై ప్రజల్లో అభిమానం మాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలతో రుజువు చేశారు.