సముద్రం ఎంతో సంపదకు ఆలవాలం. ఎన్నోరకాల చేపలు వలకు చిక్కుతుంటాయి. అప్పుడు తిమింగలాలు కూడా పడతాయి. కానీ అరుదైన చేపలు మాత్రం అరుదుగా మత్స్యకారులకు దొరుకుతాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది.
అంతర్వేదిలో మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారు వేసిన వలకు చిక్కింది మామూలు ఆషామాషీ చేప కాదండోయ్. సుమారు 750 కేజీల అరుదైన టేకు చేప. ఈ చేప ఖరీదు తక్కువేం కాదు. లక్షల రూపాయలు వుంటుందని మత్స్యకారులు ఎన్టీవీకి చెప్పారు. మామూలు చేపను తరలించడం ఎంతో కష్టం. అలాంటిది కొండంత వున్న ఈ భారీ చేపను క్రేన్ ద్వారా బోటు నుండి మినీ వాన్ లోకి షిఫ్ట్ చేశారు మత్స్యకారులు. ఆ వ్యాన్ నుంచి కాకినాడ మార్కెట్టుకు తరలించారు మత్స్యకారులు. ఇలాంటివి అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు అంటున్నారు.