ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా దాగి ఉంది.
Read Also: రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా… డిసెంబర్‌లో ఇలా…
సాధారణంగా ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. టెలికాం కంపెనీలు ప్రకటించే నెలవారీ ప్లాన్ ప్రకారం చూసుకుంటే 336 రోజులు మాత్రమే మనం రీఛార్జ్ చేసుకోగలం. అంటే మిగతా 29 రోజులకు మళ్లీ మనం రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే 12 నెలల కాలానికి మనం 13నెలల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు నెల మీద టెలికాం కంపెనీలు భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. అదనపు నెల మీద ఆదాయం లెక్కలోకి తీసుకుంటే అత్యధికంగా జియో రూ.6,186 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.5,415 కోట్లు, వీఐ రూ.2,934 కోట్లు సంపాదిస్తున్నాయి. మూడు నెలల ప్లాన్‌లోనూ 90 రోజులు ఉండకుండా 84 రోజులు మాత్రమే రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది. నాలుగు సార్లు రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మిగిలిన 29 రోజులకు ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టెలికాం కంపెనీలు భారీగానే ఆర్జిస్తున్నాయి.