కార్తికమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతి ఏటా కార్తికమాసాన క్రమం తప్పకుండా కోటిదీపోత్సవ వేడుక కనుల పండువగా సాగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి, లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక ఘట్టం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్క చోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన సంరంభం.
ఈనెల 12న ప్రారంభం అయిన కోటిదీపోత్సవం భక్తజనకోటికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. వేలాదిమంది ఒకేచోట చేరడం, దీపాలు వెలిగించడం నిజంగా అద్వితీయం. రమణీయం, కమనీయం. కోటి దీపోత్సవం రెండవ రోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా సాగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. వ్రతం చేయడం ఆనందాన్ని కలిగించిందని భక్తులు అంటున్నారు. స్వామీజీల ఆశీస్సులు, దీవెనలు పొందడం శుభపరిణామంగా వారు పేర్కొంటున్నారు.రెండవరోజు భక్తకోటి వెల్లువలా తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడింది.