NTV Telugu Site icon

నిమజ్జనం ప్రజల హక్కు, ప్రభుత్వానిదే బాధ్యత-గణేష్‌ ఉత్సవ సమితి

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్‌ అవుతుంది అనేది ఏ రిపోర్ట్‌లో లేదన్నారు భగవంత్‌ రావు.. నాలాలు కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్‌లో నీరు కలుషితం అవుతుందన్న ఆయన.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నీరు 100 శాతం కలుషితం అయ్యిందని.. 365 రోజులు పరిశ్రమల, నాళాల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుంటే.. కలుషితం కావడం లేదా? గణేష్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అని ఎవరు తేల్చారు? అని ప్రశ్నించారు.

ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు భగవంత్‌ రావు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా కాలుష్యం కాదన్న ఆయన.. ప్రతిష్టించిన విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి.. విగ్రహాలు రోడ్లపై అలాగే ఉండాలా ? అని ప్రశ్నించారు.. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపించిన భగవంత్‌రావు.. ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని.. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. మరోవైపు.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెబుతున్నాయని కామెంట్ చేసిన ఆయన.. కోర్టు తన పరిధిలో లేని విషయాలు ప్రజలపై రుద్దుతుందని వ్యాఖ్యానించారు.. కోర్టులు సంప్రదాయాలకు… ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీర్పు ఇవ్వాలన్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఎక్కడ దొరుకుతాయో ప్రభుత్వం చెప్పాలని నిలదీసిన భగవంత్‌ రావు.. ప్రభుత్వం ఎకో ఫెండ్లీ వినాయకులను అందుబాటులో ఉంచదు.. కానీ, రసాయన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.