బెట్టింగ్ అంటే క్రికెట్‌కే పరిమితం అనుకుంటాం. కాని ఎన్నికలప్పుడు కూడా భారీ బెట్టింగ్‌లు జరుగుతాయి. బెంగాళ్ అసెంబ్లీ ఎన్నికలా..హుజూరాబాద్ ఉప ఎన్నికలా అన్నది కాదు. టఫ్ ఫైట్ ఉంటే చాలు ఇలా అక్రమంగా వందల కోట్లు చేతులు మారుతాయి. పందెం రాయుళ్లకు ప్రాంతంతో సంబంధం లేదు. హోరా హోరి ఉందా.. లేదా, అన్నదే ముఖ్యం.
ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ తెలంగాణే కాదు యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు దీనిని పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగు వీరుల దృష్టి దీనిపై పడింది. ఊహించని స్థాయిలో పందెం కాస్తున్నారని ఇటు ప్రధాన మీడియా, అటు సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి.
సమాచార వర్గాల ప్రకారం హుజురాబాద్‌పై బెట్టింగ్ ఇప్పటికే 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. ఈ ఉపఎన్నికపై చాలా రోజుల క్రితమే బెట్టింగ్ మొదలైనా..ఎన్నికల తేదీ దగ్గరవటంతో అది మరింత జోరందుకుంది. పోలింగ్ రోజు నాటికి 300 కోట్లకు చేరుతుందని అంచనా. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, నాందెడ్, ముంబయ్ వంటి ప్రాంతాల వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ పందెం ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే.
రూపాయికి పది రూపాయలు. పందెంలో ఎంత పెడితే అంతకు పదింతలు ఇస్తారు గెలిస్తే. అంటే వందకు వెయ్యి.. వెయ్యికి పది వేలు, పదివేలకు లక్ష.ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఫోన్లు చేసి గెలుపు అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఆరాతీస్తున్నారు. కేవలం అభ్యర్థుల గెలుపు ఓటముల మీదే పందెం కాయట్లేదు. గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఏఏ మండలంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం.
ఏపీకి చెందిన రాజకీయ నేతలు తెలంగాణ లోని తమ మిత్రులకు ఫోన్ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయంటూ వివరాలు తెలుసుకుంటున్నారు. కొందరు హుజూరాబాద్‌కు వెళ్లి స్వయంగా పరిస్థితి తెలుసుకుని పోతున్నారు. మరికొందరు బెట్టింగ్ వీరులు అక్కడే మకాం వేసి మరీ ఓటరు పల్స్ పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు హుజురాబాద్ ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో. ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడిన వారు అది ముగియడంతో ఇప్పుడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. దాంతో పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో పడ్డాయి. మద్యం, మాంసం పంపిణీతో పాటు ఇంటింటికి వెళ్లి నగదు కూడా చేతిలో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఓటుకు 6 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారని స్థానికులు అంటున్నారు. డబ్బు ముట్టని వారు ఆందోళనకు దిగటం చూస్తుంటే నగదు పంపిణీ నిజమేనని అర్థమవుతోంది. బుధవారం రాత్రి నియోజకవర్గంలోని పలు చోట్ల మహిళలు ఆందోళన చేశారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ఆరోపించారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్, జమ్మికుంట మండలం మడిపెల్లి, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌లో ఈ దర్నాలు జరిగాయి.
ప్రధాన పార్టీలు పోటీపడి ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి. కానీ నేతలు ఓటరు నాడి పట్టుకోలేకపోతున్నారు. గాలి ఎటు వీస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. బెట్టింగ్‌రాయుళ్లకు కూడా ఈ టెన్షన్ తప్పట్లేదు. గతంలో రాజకీయ పార్టీలు తమకు నమ్మకం కుదిరిన వారికి మాత్రమే బహుమతులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అందరికి ముట్టచెబుతున్నారు. ఓటర్లు కూడా ఎవరు ఏది ఇచ్చినా చక్కగా స్వీకరిస్తున్నారు. కానీ ఏ పార్టీకి ఓటేస్తారో మాత్రం చెప్పటంలేదు.
నాయకులే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా హుజురాబాద్ ఓటరును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరు గెలుస్తారని అడిగితే.. “చెప్పలేం” అనే సమాధానం మాత్రమే వస్తుంది వారి నుంచి. ఎవరికి ఓటు వేస్తారంటే నోరు విప్పుట లేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఓటర్లకు పార్టీ పట్టింపులు లేవని అర్థమవుతోంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న వివక్ష లేదు వారికి ఇప్పుడు. అందుకే , ఉదయం ఒక రాజకీయ పార్టీ క్యాంపులో కనిపించిన వారు సాయంత్రం అయ్యేసరికి ప్రత్యర్థి శిబిరంలో దర్శనమిస్తున్నారు.
ఓటర్లే మాత్రమే కాదు, కొందరు తాము ప్రచారం చేస్తున్న పార్టీకే ఓటు వేస్తారో లేదో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉద్యొగం లేని యువకులు నేతలు ఇచ్చే బహుమతుల కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఓటు తాము క్యాంపెయిన్ చేస్తున్న పార్టీ అభ్యర్థికి పడుతుందో లేదో కూడా డౌటే!
మరోవైపు, ప్రలోభాలను అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసు బృందాలు గ్రామాలకు వెళ్లి చెకింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల 29 లక్షల 36 వేల 830 రూపాయల నగదు స్వాధీనమైంది. వచ్చే రెండు రోజుల్లో ఇంకెంత పట్టుబడుతుందో చూడాల్సివుంది!!