రైతుల మహాపాదయాత్ర ముగింపు సభ ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సభలో రైతులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని అన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యామాన్ని నడిపిస్తోందని అన్నారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను వెంటవేసుకొని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని అన్నారు.
Read: వైరల్: వీడి ఆత్రం తగలయ్య… పెళ్లి మండపంలోనే…
చరిత్రలో ఇప్పుడూ లేని విధంగా వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలు ఒకే వేదికపైకి వచ్చాయని విమర్శించారు. జగన్‌ను పదవి నుంచి దింపాలనే అనైతికంగా పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఒకే రాజధానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టు తీర్పులను కూడా ముందుగానే చంద్రబాబు చెబుతున్నారంటే ఏ స్థాయిలో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నాడో చెప్పక్కర్లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీలో ఎంగిలికూడు తిన్న నాయకులు ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణం రాజు బాబుతో కలిసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.