సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆయన రాష్ట్రమంతా చేసిన పాదయాత్రనే. జనంలో ఉన్నాడు కాబట్టే గెలిచాడంటారు. అందుకే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నాడు ఇచ్చిన హామీలతోపాటు ఎన్నికలను మేనిపెస్టోనూ తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. దీంతో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడిగా, విశ్వసనీయనేతగా జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ కారణంగానే రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల జరిగినా ఫలితం మాత్రం వైసీపీ పక్షాన వస్తోంది. సహజంగానే అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసివస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. దీంతో మధ్య దళారీ వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ప్రభుత్వ పథకాల్లోని లోటుపాట్లను, ప్రజల్లోని భిన్నాభిప్రాయాలను వలంటీర్లు తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థ ఏపీలో బాగా పాపులర్ అయింది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ వ్యవస్థ అక్కడ అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి.
ఏపీలో సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వాటిని సందర్శించిన దాఖాలాలు లేవు. అయితే ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నుంచి నేరుగా ఆయన సచివాలయాలను సందర్శించనున్నట్లు చెప్పారు. తాను సందర్శించటమే కాకుండా జిల్లా అధికారులను సందర్శించమని ఆదేశించారు. అదేవిధంగా ఎమ్మెల్సేలు సైతం వచ్చే నెల నుంచి నెలకు నాలుగు సచివాలయాలను సందర్శించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఏపీ సర్కారు అమలు చేస్తున్న ప్రతీ పథకం ప్రజల్లోకి వెళ్లేందుకు వలంటీర్ల వ్యవస్థ బలంగా పని చేస్తుంది. సచివాలయాలు ముఖ్యంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నాయి. ఈ వ్యవస్థ అటూ ప్రజలకు, ఇటూ ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తుంది. దీంతో ఈ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఎలా పని చేస్తుంది? అనేది తెలుసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అవసరమైతే మరిన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చాక కొద్దిరోజులకే కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుపడటం లేదు. కేవలం అధికార కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆయన కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ నుంచి సచివాలయాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న సచివాలయాలను జగన్మోహన్ రెడ్డి సందర్శించడం ద్వారా ముందస్తు సంకేతాలను పంపిస్తున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలారోజుల తర్వాత ప్రజల్లోకి వస్తుండటంతో వైసీపీ శ్రేణులు సైతం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.