Site icon NTV Telugu

Ashok Gehlot : ఖలిస్తాన్‌పై అమృతపాల్‌ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం

Amritpal Singh And Ashok Ge

Amritpal Singh And Ashok Ge

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ‘హిందూ రాష్ట్రం’ అనే పదాలను తరచుగా పల్లవిస్తుండటంతో వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ గురించి మాట్లాడే ధైర్యం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో మత రాజకీయాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. డివిజనల్‌ స్థాయి ఉద్యోగుల సదస్సులో గెహ్లాట్‌ మాట్లాడారు. “పంజాబ్‌లో అమృతపాల్‌లో కొత్త పేరు వచ్చింది. మోహన్ భగవత్, నరేంద్ర మోదీలు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడగలిగితే, నేను ఖలిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అమృతపాల్ సింగ్ అన్నారు. అతని ధైర్యం చూడండి. నువ్వు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడినందుకే అతనికి ధైర్యం వచ్చిందా?” అని అన్నారు.

“అగ్నిని ప్రారంభించడం చాలా సులభం, కానీ దానిని ఆర్పడానికి సమయం పడుతుంది. ఇలా జరగడం దేశంలో మొదటిసారి కాదు. ఈ కారణంగానే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్‌ను సృష్టించడానికి ఆమె అనుమతించలేదు” అని వ్యాఖ్యానించారు. దేశంలో మతం పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే దేశ హితం కోసం అన్ని మతాలు, కులాలకు చెందిన వారిని వెంట తీసుకెళ్తే ఈ దేశం ఐక్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:Priyanka Hugs Karan: కరణ్ జోహార్‌ను కౌగిలించుకున్న ప్రియాంక చోప్రా

కాగా, అమృతపాల్‌ కోసం పంజాబ్ పోలీసులు అన్వేషిస్తున్నారు. మార్చి 18 నుండి పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన తర్వాత అతని సన్నిహితులలో ఒకరైన లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు మూడు వారాలకు పైగా అణిచివేత జరిగింది. ఇటీవల తాను లొంగిపోవడం లేదంటూ అమృతపాల్ సింగ్ ఫుల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పంజాబీ సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని సాధించేదాక తన ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆ వీడియోలో తెలిపాడు.

Also Read:Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!

వారిస్ పంజాబ్ దే సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ ప్రత్యేక దేశం పేరుతో అమృతపాల్ సింగ్ హింసను ప్రేరేపిస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో అంటకాగుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అతడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగాయి. అయితే అమృతపాల్ సింగ్ రకరకాల మారు వేషాలతో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ మార్చి 21న తూర్పు ఢిల్లీలోని మధు విహార్‌లో నడుస్తున్నట్లు చూపుతున్న కొత్త సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. అతను తలపాగా లేకుండా కనిపించాడు. అమృతపాల్ సింగ్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Exit mobile version