భారత్-పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఇక, తాజాగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు భారతీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే కాగా.. పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన ఆయన.. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్.. ఇప్పటికే ఓసారి నిరూపించాయని గుర్తుచేవారు.. ఏమీ పట్టనట్టు మళ్లీ అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించారు కేంద్ర హోంశాఖ మంత్రి.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్ అని తెలిపారు అమిత్‌షా… ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం చేయకూడదన్న గట్టి సందేశం దీని ద్వారా వెళ్లిందన్నారు. సరిహద్దుల్లో ఏదైనా జరిగితే ఒకప్పుడు చర్చలు జరిగేవి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దెబ్బకు దెబ్బ కొట్టే సమయం అని హెచ్చరించారు అమిత్‌షా.