పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ‘అఖండ’ చిత్ర బృందానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పవచ్చు కానీ ఈ వేదికపైనే ఎందుకు చెప్తున్నానంటే… అఖండ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ఊపును తెచ్చిందని బన్నీ వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్‌నే సిక్సర్ కొడితే ఎంత కిక్ వస్తుందో.. తనకు ఆ కిక్ బాలయ్య అఖండ సినిమాతో వచ్చిందని వివరించాడు.
అఖండ సినిమా ఒరవడి మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు హీరో అల్లు అర్జున్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 17న మా సినిమా ‘పుష్ప’ వస్తుందని… ఆ తర్వాత నాని ‘శ్యామ్‌సింగరాయ్’, ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్, భీమ్లానాయక్, ఆచార్య వంటి సినిమాలు వస్తున్నాయని.. అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని బన్నీ పేర్కొన్నాడు. హీరో ఎవరన్నది ముఖ్యం కాదని సినిమానే అంతిమంగా గెలవాలని ఆకాంక్షించాడు. దర్శకుడు సుకుమార్‌ను ఈ ఫంక్షన్‌కు వచ్చేలా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించానని.. కానీ అతడే తనను ఒప్పించాడని అల్లు అర్జున్ తెలిపాడు. చివరి సీన్ వరకు అలరించే అద్భుతమైన సినిమా వస్తుందని అందరికీ చెప్పు అంటూ తనను ఈ ఈవెంట్‌కు పంపించాడని బన్నీ వివరించాడు.