మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టాటా గ్రూప్ వెంటనే ఎంపీల ఉచిత విమాన ప్రయాణాలను కట్ చేసింది. టాటా గ్రూప్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎంపీలు ఎయిరిండియాలో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసి అనంతరం పార్లమెంట్ సచివాలయానికి రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Read Also: బాణసంచాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత విమాన టికెట్ సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా గతంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి సిఫారసుతో ఎంపీలు మరిన్ని సీట్లు తీసుకునేవారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. అటు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేసేది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపివేసిన సంగతి విదితమే. ఇవే కాకుండా పార్లమెంట్ క్యాంటీన్‌లో ఎంపీలకు చౌకగా లభించే ఆహారాల ధరలను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచేసింది.