పచ్చి నెత్తురు తాగే పెద్ద పులి పచ్చిగడ్డి తింటుందంటే నమ్ముతారా? తాలిబన్లు కూడా అంతే. ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయి. హాలీ మెక్ కే అనే అమెరికా జర్నలిస్టు తాలిబన్ల ఘాతుకాలను కళ్లారా చూసింది. డల్లాస్ మార్నింగ్ న్యూస్ కోసం పని చేస్తున్న ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ..చూసిన దాన్ని బట్టి ..ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు దారుణాలకు పాల్పడతున్నారు. దాంతో ఇన్నాళ్లూ స్వేచ్చగా జీవించిన అమ్మాయిల బతుకులు ఇప్పడు తలకిందులవుతున్నాయి.
కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆడవాళ్ల కోసం వేటాడుతున్నారు. రాత్రి వేళ ఇంటి తలుపు తట్టి కనిపించిన అమ్మాయినల్లా పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయికి 15 ఏళ్లు దాటితే చాలు .. తాపెళ్లి చేసుకుని ఎత్తుకుపోతున్నారు. హాలీ మెక్‌కే తాను నివసిస్తున్న మజర్ -ఎ-షరీఫ్ నుంచి ఎలాగోలా తప్పించుకుంది. అయితే ఆమె అఫ్గాన్ స్నేహితులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. తాలిబన్ రాక్షసులు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో తెలియదు..అదే తలుచుకుంటూ బిక్కు బిక్కు మంటూ బతుకులీడుస్తున్నారు.
ఎంతో మంది చిన్నారులు చదువుకోవాలని ఆశపడుతున్నారు. డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కలలు కంటున్నారు. కానీ కరుడుగట్టిన చాందస వాదుల చేతుల్లో వారి కలలు కల్లలవుతున్నాయి. తమ హక్కుల కోసం ఆశపడుతున్న ఎంతో మంది ఆఫ్గన్ మహిళల గొంతు ఇప్పుడు మూగబోయింది. తాలిబన్ల రాకతో కాళ్ల కింద భూమి కంపించినట్టయింది వారికి.
తాము ఆఫ్గన్ ప్రజల రక్షకులమంటూ ఇళ్లకు వచ్చి పిల్లని అడుగుతున్నారు. అడగటం కూడా కాదు డైరెక్టుగా పెళ్లికే ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి దండ్రులకు ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. అర్థరాత్రి ఇళ్లలో చొరబడి అమ్మాయిలను అపహరించుకుపోతున్నారు. అలాంటి ఓ ఘాతుకం గురించి మెక్‌కేకు ఆమె స్నేహితురాలు చెప్పారు. ఓ 21 ఏళ్ల అమ్మాయిని తాలిబన్ పెళ్లి చేసుకుని అర్థరాత్రి తన వెంట తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు మరో నలుగురు కలిసి ఆమెను పంచుకున్నారు. మూడు రోజుల తర్వాత ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. మూడు రోజులు కంటిన్యూగా ఆమెపై అత్యాచారం జరిపారని తెలిసి ఆ తండ్రి గుండె పగిలేలా ఏడ్చాడు. స్థానిక అధికారులకు మొరపెట్టుకుంటే …ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.
ఇప్పుడు తాలిబన్లకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లతో పారిపోతున్నారు ఎక్కడయినా దాక్కుందామని. ఈ బలవంతపు పెళ్లిల్లు లక్షలాది మంది ఆఫ్గన్ మహిళల బతుకులను ఛిద్రం చేస్తాయి. తాము ఇంతకు ముందు తాలిబాన్లం కాదు మారిన తాలిబన్లమని డబ్బా కొట్టుకుంటున్నారు… కానీ వారు కాస్త కూడా మారలేదు..పైగా ఇంకా ఎక్కువ అరాచకం ప్రవర్తిస్తున్నారు. హింస, రక్తాపతం ..మానవ హక్కుల ఉల్లంఘనకు నిర్వచనం తాలిబన్లు…వాళ్లు ఎలా మారతారని నమ్ముతున్నారని ఆఫ్గన్ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెపుతారు!!