ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది. సంక్షేమ పథకం అందాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే. స్కూల్‌లో అడ్మిషన్ కావాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ప్రస్తుతం ఏడాది దాటిన వారికే ఆధార్ ఇస్తుండగా ఇకపై పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సన్నాహాలు చేస్తోంది.
Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్ లీక్..!!
అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయమై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో చర్చలు జరుపుతున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తామని సౌరభ్ గార్గ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మాత్రం బయోమెట్రిక్ తీసుకుంటామని ఆయన వివరించారు. ఇప్పటికే దేశంలోని 99.7 శాతం (137 కోట్లు) మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.