భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. మరోవైపు.. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే, ఈ ఘటనకు ఇరవై ఏళ్ల అయినా ఆ దృశ్యం కళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది.
భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న సమయంలో 2001 డిసెంబర్ 13న.. పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో పెద్ద రచ్చే జరుగుతోంది.. ఆ రోజు కూడా బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది.. కానీ, 11:02 గంటలకు పార్లమెంటు వాయిదా పడింది. ఆ తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ కూడా పార్లమెంట్ నుంచి అప్పడికే వెళ్లిపోగా.. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా బయల్దేరింది.. కానీ, పార్లమెంట్‌లో కొన్ని నిమిషాల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోయారు.. ఉదయం 11.30 గంటల సమయంలో శ్వేతజాతీయుల అంబాసిడర్ కారులో ఐదుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్-12 నుంచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అది గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ కారు వెనకాలే పరిగెత్తాడు.. ఉగ్రవాదుల కారు ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టింది.. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద ఏకే-47లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉండగా, సెక్యూరిటీ గార్డులు ఆ సమయంలో నిరాయుధులుగా ఉండడంతో.. వెంటనే వారిని నిలువరించడం కష్టమైంది..
ఇక, అక్కడే ఉన్న పీఆర్‌పీఎఫ్‌కి చెందిన బెటాలియన్.. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవైపు ఎల్‌కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ సహా పలువురు ప్రముఖులు సభలోనే ఉండగా.. ఊహించని ఈ పరిణామంతో అందరినీ అలర్ట్ చేశారు.. ఇంతలో ఓ ఉగ్రవాది గేట్ నంబర్ 1 నుంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయడం.. భద్రతా బలగాలు అతడిని హతమార్చడం క్షణాల్లో జరిగిపోయింది.. తర్వాత ఆ ఉగ్రవాది శరీరంపై ఉన్న బాంబు కూడా పేలింది. మిగతా నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 నుంచి లోపలికి ప్రవేశించడానికి యత్నించారు.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులను అక్కడే మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.. ఇక, మిగిలిన చివరి ఉగ్రవాది గేట్ నంబర్ 5 వైపు పరుగులు పెట్టగా.. అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చారు సైనికులు.. ఈ పరిణామం.. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగింది.. మొత్తంగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. కుట్రదారులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసులో అఫ్జల్ గురు, ఎస్‌ఏఆర్ గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్‌లను అరెస్టు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు జిలానీ, అఫ్షాన్‌లను నిర్దోషులుగా ప్రకటించగా.. అఫ్జల్ గురు మరణశిక్షను సమర్థించింది. 2013న తీహార్ జైలులో అఫ్జల్ గురును ఉరితీశారు.
ఆ దాడి ఘటన 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమరులైనవారిని అంతా స్మరించుకుంటున్నారు.. ఉగ్రదాడిలో ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు.. ఇలా అందరూ నివాళులర్పించారు.. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. 2001లో సరిగ్గా ఇదేరోజు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేయగా.. 2001లో పార్లమెంట్ దాడి సమయంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను.. దేశానికి వారి సేవ మరియు అత్యున్నత త్యాగం ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, పార్లమెంట్‌పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.. ఉగ్రదాడిలో జాతి గర్వాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల ధైర్యానికి, పరాక్రమానికి వందనం చేస్తున్నానని తెలిపారు. భద్రతా బలగాల అసమాన శౌర్యం, త్యాగం దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్ చేశారు అమిత్‌షా.. ఇక, పార్లమెంట్ హౌస్‌పై దాడి సందర్భంగా ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.