మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు 2 ఓట్లు ఉన్నాయి. ఏర్పాటు చేసిన 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ 11, నారాయణ పేట్ 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్ గిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.
Also Read:CM YS Jagan: ఎస్‌ఎల్బీసీ సమావేశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల పరిశీలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 16న సరూర్‌నగర్ స్టేడియంలో ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ ఇప్పటికే ముగియగా.. 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీ కాలం ఈ నెల 29న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Also Read:EX MP Vivek: అవినీతి ఎక్కడుంటే.. సీబీఐ, ఈడీ అక్కడే ఉంటాయి
కాగా, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ వర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి పెద్దఎత్తున పేర్లను తొలగించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. 12 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నియోజకవర్గ ఎన్నికలకు మొత్తం 27,720 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పారు. 12 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో జీహెచ్‌ఎంసీ అధికారి, పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్‌లు ఉంటారని వివరించారు.