హక్కులను పొందడం కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నదే రామావతార సందేశం అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిదన్నారు. శ్రీ కొమాండూర్ శశికిరణ్ రాసిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు.మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.
శ్రీరాముడి జీవిత గాధ నుంచి యువత స్ఫూర్తిని పొందాలన్నారు. రామాయణం మతగ్రంథం కాదు, పాఠ్యప్రణాళికలో భాగంగా విద్యార్థులకు బోధించాలి. మనిషి జీవితంలోని ప్రతి సందర్భంలోనూ శ్రీరాముడి ఆదర్శాలు అత్యంత ఆవశ్యకం. నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని జీవితం అందిస్తుందన్నారు. అందుకే శ్రీరామునికి యావత్ భారతజాతి గుండెల్లో గుడికట్టి కొలుచుకుంటోందన్నారు వెంకయ్యనాయుడు. పురాణాలంటే వయసు మళ్ళిన వాళ్ళు చదివే పుస్తకాలు కాదు, యువతకు దిశానిర్దేశం చేసే కాలాతీత గ్రంథాలు అన్నారు. భాషతో పాటు తెలుగు పద్యాన్ని ఆదరించాలి, తద్వారా మన సాహితీ వారసత్వాన్ని కొనసాగించాలని ఉద్బోధించారు. తెలుగు భాష భోజనమైతే, పద్యం విందు భోజనం అన్నారు వెంకయ్యనాయుడు.