నేడు ఏపీలో పెన్షన్ల పంపిణీ.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఇక, ఇవాళ సీఎం చంద్రబాబు ఉదయం 10.40 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కొత్త గొల్లపాలెంకి బయలు దేరుతారు.. 11.10 నిమిషాలకు కొత్త గొల్లపాలెంకి చేరుకోనున్నారు. 11.45 నుంచి 12.25 మధ్య లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ చేయనున్నారు. 12.25 నిమిషాలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముఖాముఖి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.15 నుంచి 3.35 వరకు పర్చూరు నియోజక వర్గ టీడీపీ క్యాడర్ తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకి హెలికాఫ్టర్ లో కొత్త గొల్లపాలెం నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు.
నేటికి వాయిదా పడిన కాకాణీ గోవర్థన్ రెడ్డి పోలీసుల విచారణ..
మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు (ఏప్రిల్ 1న) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిన్న (మార్చ్ 31న) విచారణకు గైర్హాజరైన కాకాణి.. నెల్లూరు, హైదరాబాద్ లలోని నివాసాలలో అందుబాటులో లేకపోవడంతో అతడి కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే, ఈ రోజు మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు పోలీసు అధికారులు. దీంతో పాటు నేడు ఏపీ హైకోర్టులో కాకాణీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అదే విధంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కాకాణీ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ కూడా న్యాయస్థానం చేయనుంది.
గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్డౌన్..
గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది. అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్ గా హరివేంకట కుమారి నిలవనున్నారు. ఇక, బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం ఉంది. మెజారిటీకి నలుగురు సభ్యుల దూరంలో కూటమి ఉంది. ఇక, 34 మంది కార్పోరేటర్లను వైసీపీ బెంగుళూరుకు తరలించింది. ప్రస్తుతం భీమిలి తర్వాత మలేషియాలో కూటమి నేతలు శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు దూరంగా జనసేన పార్టీ ఉంది. శిబిరాల సంస్కృతి లేదని, అధినేత ఆదేశాలు ఫైనల్ అని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. మొత్తం కార్పొరేటర్లు 98 మంది ఉండగా.. ఒక స్థానం ఖాళీగా ఉంది. కార్పొరేటర్లు 97 + ఎక్స్ ఆఫీషియో 14 ఉన్నాయి. టోటల్ ఓట్లు 111 కాగా, 2/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యం అవుతుంది.
హెచ్‌సీయూకు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితిలు తెలుసుకునేందుకు ఈ సందర్శన కొనసాగనుంది. హెచ్‌సీయూ భూముల వేలాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్షజాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
హెచ్సీయూ వద్ద టెన్షన్ వాతావరణం.. యూనివర్సిటీ బంద్‌కు ఏబీవీపీ పిలుపు..
హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ అంశంపై తాజాగా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడారు. “హెచ్‌సీయూలో భూముల అమ్మకాన్ని విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. జీవవైవిద్యాన్ని కాపాడాలని అంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు. కంచెలు తొలగించామన్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి నిర్బంధ పాలన కొనసాగిస్తుంది.
తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వడగళ్ల వర్షాలు
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. మరోవైపు.. హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ శాతం కూడా భారీగా తగ్గిపోయింది. రాష్ట్రంలోనే అతితక్కువగా తేమశాతం నమోదవుతుంది. దీంతో తీవ్రమైన వేడితో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. నేటి నుంచి వాతావరణం మారుతుందని.. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నేటి నుంచి రానున్న మూడ్రోజుల్లో వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు. ఒకప్పుడు సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు హిట్ కోసం తంటాలు పడుతున్న కొందరి గురించి చర్చింకుకోవాలి. గీత గోవిందం విజయ్ దేవరకొండ చివరి హిట్. మళ్ళి ఆ రేంజ్ సక్సెస్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చాడు రామ్. శర్వానంద్ అప్పుడెప్పుడో శతమానం భావతి తర్వాత హిట్ మాట వినలేదు. విశ్వక్ సరైన హిట్ కొట్టి ఎన్నేళ్లవుతుందో. ఇక నితిన్ సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అక్కినేని వారసుడు అయ్యగారి సంగతి సరేసరి. ఈయన హిట్ కొట్టేవరకు రీరీరీ లాంఛ్ అవుతూనే ఉండేలా ఉన్నాడు. ఇంకా చాలా మంది ఇతర హీరోలది ఇదే పరిస్థితి.
బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో , తన నటన అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ప్రజెంట్ రూట్ మార్చింది. ఆఫర్ తగ్గడంతో హీరోయిన్‌లు ఇండస్ట్రీ మార్చడం, లేదా స్కిప్ షో చేయడం కామన్. ఇక్కడ కీర్తి కూడా అదే చేసింది బిగినింగ్‌లో సాఫ్ట్ క్యారెక్టర్స్.. పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పడు టోటల్‌గా చేంజ్ అయింది. ఉహించని విధంగా స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. ముఖ్యంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తు రచ్చ చేస్తోంది. ఇక రీసెంట్‌గా సౌత్ హీరోయిన్ లు బాలీవుడ్‌లో క్రెజీ ఆఫర్‌లు అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లోకి కీర్తి కూడా జయిన్ అయ్యింది. ఇప్పుడు దీని గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్‌తో కీర్తి జోడీ కట్టనున్నట్లు సమాచారం. మంచి క్రేజ్ ఉన్న వీరిద్దరి కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తోందట చిత్రబృందం. మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు కీర్తి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్‌లో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. ఈడెన్ గార్డెన్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై అత్యధికంగా కోల్‌కతా 9 విజయాలు నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో పంజాబ్‌పై 8 విజయాలు సాధించింది. వాంఖడేలో ఆర్సీబీపై ముంబై, బెంగళూరులో ఆర్సీబీపై ముంబై, చెన్నైలో ఆర్సీబీపై సీఎస్కే, కోల్‌కతాలో ఢిల్లీపై కేకేఆర్ కూడా 8 విజయాలు నమోదు చేశాయి. ఇక మొత్తంగా కేకేఆర్‌పై 24 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది. కేకేఆర్‌పై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై అగ్ర స్థానంలో ఉంది.