టీడీపీకి మాజీ మంత్రి గంటా ఝలక్..!
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు.. ఎప్పటి నుంచో ఈ ప్రచారం సాగుతున్నా.. ఫైనల్‌గా డిసెంబర్ నెలలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరనున్నట్టు తన సన్నిహితుల దగ్గర గంటా శ్రీనివాస్‌రావు చర్చించినట్టుగా సమాచారం.. అయితే, పార్టీని వీడేకంటే ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయనే సమావేశం కానున్నారట.. హైదరాబాద్ వెళ్లనున్న గంటా శ్రీనివాస్‌రవు.. చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.. ఇప్పటికే అపాయింట్‌మెంట్ కూడా కోరారు.. ఇక, డిసెంబర్ 1వ తేదీన గంటా శ్రీనివాస్‌రావు పుట్టిన రోజు ఉంది.. ఆ వేడుకల తర్వాత.. వైసీపీలో చేరనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా బాబుకు బైబై చెప్పి.. జగన్ దగ్గరకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు గంటా శ్రీనివాసరావు.
6,511 పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో పోలీసు కొలువులు భర్తీ చేయనుంది.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ప్రతీ ఏడాది 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. సీఎం ఆదేశాలను అనుగుణంగా.. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది.. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఖరారు చేశారు.. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.. ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు.. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోస్టింగ్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సై (సివిల్)- 387, ఎస్సై (ఏపీఎస్పీ) – 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)- 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్)- 2,520 భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణలో దూకుడు చూపిస్తోంది.. ఇవాళ సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్ హాజరయ్యారు. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో కరీంనగర్ లాయర్ శ్రీనివాస్ ను ఏ7గా చేర్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. శ్రీనివాస్.. నందు, సింహయాజితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి నందుతో రూ.55 లక్షల లావాదేవీలు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇప్పటికే అంబర్ పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖ ఇద్దరు విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు వారిని వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా విచారించారు.. నిందితుడు నందు, అతని భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్ మధ్య పలు ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ చాటింగ్ లు, కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు వాటిపై ప్రతాప్ ను విచారించినట్లు సమాచారం. తొలుత తాను ఎవరితోనూ సంభాషించనని, సందేశాలు పంపలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కానీ పోలీసులు అతడి ముందు ఆధారాలు ఉంచి విచారించగా సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. దీంతో, ఇవాళ విచారణ ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది.
మానని గాయానికి 14 ఏళ్లు..
నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడితో భారతావనితో పాటు యావత్ ప్రపంచం వణికిపోయింది. భారత్‌తోపాటు మరో 14దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణహోమం జరిగి నేటికి 14ఏళ్లు అయ్యింది. లష్కరే ఉగ్రమూకలు.. ముంబయిలోని 12 చోట్ల సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ముష్కరదాడుల్లో అమరుడైన ఓ కానిస్టేబుల్ పేరును మహారాష్ట్రలో ఆయన స్వగ్రామానికి పెట్టారు. నవంబర్ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.
డిసెంబర్‌లో 13 రోజులు బ్యాంకుల మూత..
డిసెంబర్‌లో 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో బ్యాంకులు ఎనిమిది రోజులు మాత్రమే మూసివేయబడతాయి, అయితే ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి. అంటే.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో వచ్చే నెల మూడో తేదీన, 12,19, 26, 29,30,31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 4,10,11,18,24,25 తేదీల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఇలా.. మొత్తంగా బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి.
డ్రాగన్ కంట్రీలో 10 మంది సజీవ దహనం
చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్‌లో ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులకు.. మంటలను అదుపు చేసేందుకు మూడు గంటల సమయం పట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగడంతో అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలలో అపార్ట్‌మెంట్ వాసులందరూ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకుని 10 మంది సజీవ దహనం అవగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
‘అవతార్’కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్!
జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచమంతటా డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియాలో కేవలం 3 రోజులలో 45 స్క్రీన్‌లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మేట్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. భారతదేశం అంతటా ఆరు భాషలలో… (ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ) విడుదల కానుందీ సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులలో కొత్త బెంచ్ మార్క్ సృష్టించటానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 3 వారాలు టైమ్ ఉంది. అయినా ఇంత ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేసినా ఇలాంటి స్పందన రావటం థియేటర్ యజమానులకు ఆనందాన్నిస్తోంది. రిలీజ్ కి ముందే బ్లాక్‌బస్టర్ హిట్ సంకేతాన్ని అందచేస్తున్నట్లు పివిఆర్ పిక్చర్స్ సిఇవో కమల్ జియాంచందానీ అంటున్నారు.
ఫిఫా ప్రపంచకప్ నుంచి ఖతార్ ఔట్
అత్యంత చెత్త ప్రదర్శనతో ఆతిథ్య ఖతార్ జట్టు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో సెనెగల్ 3–1తో ఖతార్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు స్ట్రయికర్ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్ అందించారు. ఫమారా 48వ నిమిషంలో చేసిన గోల్ తో సెనెగల్ ఆధిక్యం 2–0కి పెరిగింది. దాంతో, ఖతార్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అయితే, 78 నిమిషంలో మొహమ్మద్ ముంటారి గోల్ చేయడంతో ఖతార్ 1–2తో రేసులోకి వచ్చేలా కనిపించింది. మరో గోల్ చేస్తే ఖతార్ డ్రాతో గట్టెక్కేలా కనిపించింది. కానీ, ఆరు నిమిషాల తర్వాత బంబా డియెంగ్ సెనెగల్‌కు మూడో గోల్ అందించడం ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఖతార్ 0–2తో ఈక్వెడార్ చేతిలో ఓడిపోయింది. దాంతో, రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్ దారులు మూసుకుపోయాయి. 92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన ఆతిథ్య జట్టుగా ఖతార్ అపఖ్యాతి మూటగట్టుకుంది.